సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో పాటు ఆయన అభిమానులు ప్రస్తుతం ‘జైలర్’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన జోష్‌లో ఉన్నారు. రెండు వారాల కిందట విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంతోషకర సమయంలో రజినీ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఆయన యూఫీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడానికి లక్నో వెళ్లిన సందర్భంగా ఆయన్ని చూడగానే పాదాభివందనం చేయడం చాలామందికి రుచించలేదు.
52 ఏళ్ల రజినీ.. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన యోగి కాళ్ల మీద పడటం ఏంటనే విమర్శలు వచ్చాయి. యోగి సన్యాసి అనే విషయం పక్కన పెట్టి ఆయన ముఖ్యమంత్రి కాబట్టే రజినీ కాళ్ల మీద పడ్డాడని.. బీజేపీ నేతల పట్ల ఆయన సానుకూలతకు ఇది నిదర్శనమని ఆయన మీద విమర్శలు గుప్పించింది ఒక వర్గం. రజినీ లక్నోలో ఉండగా తమిళనాట ఈ విషయం దుమారం రేపగా.. అక్కడ్నుంచి తిరిగి చెన్నై చేరుకున్నాక రజినీ ఈ వివాదంపై స్పందించారు.
‘‘యోగులు, సన్యాసులను కలిసినపుడు గౌరవసూచకంగా వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. వాళ్లు వయసులో నా కంటే చిన్నవారైనా పట్టించుకోను. యోగి ఆదిత్యనాథ్ విషయంలోనూ అలాగే చేశాను’’ అంటూ సింపుల్‌గా తేల్చేశారు రజినీ. నిజానికి సూపర్ స్టార్ ఇలా వయసుతో సంబంధం లేకుండా సన్యాసులు, యోగుల కాళ్ల మీద పడటం కొత్తేమీ కాదు. తరచుగా హిమాలయాలకు వెళ్లే ఆయన అక్కడ ఎన్నోసార్లు ఈ పని చేశారు. యోగిని కూడా ఆయన ఒక సన్యాసిగానే చూశారు. యోగి ఒక మఠానికి అధిపతి అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
కానీ విమర్శకులు మాత్రం రజినీ పాదాభివందనంలో రాజకీయ కోణమే చూశారు. ముఖ్యమంత్రి కాబట్టే పాదాభివందనం చేశాడని.. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తి కాళ్ల మీద రజినీ పడటం ఏంటని విమర్శించారు.