రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ ఏమి మాట్లాడినా చెల్లుబాటైపోతుందని అనుకుంటున్నట్లున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతు తమపార్టీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు-టీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ కు పోలిక పెట్టి మాట్లాడారు. నిజానికి ఈటలతో రఘురామకు పోలిక పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇద్దరి వ్యవహారాలు వేర్వేరు.
ఈటల నిఖార్సయిన రాజకీయనేత. ఉద్యమపార్టీ అయిన టీఆర్ఎస్ నేతగా చాలా సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నారు. వరుసగా నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. సరే ఏదో కారణాలతో అధినేత కేసీయార్ తో పడని కారణంగా మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయ్యారు. తర్వాత బీజేపీలో చేరి ఇపుడు ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేసి ఉపఎన్నికలకు సవాలు విసిరారు.
ఇక రఘురామ విషయం తీసుకుంటే వైసీపీ బతిమాలి తెచ్చుకున్న నేత. ఇప్పటికీ సస్పెండ్ చేయడానికి కూడా వైసీపీ భయపడుతోంది. ఎన్నికల సమయంలో రఘురాముడి వద్ద ఇతర నియోజకవర్గాలకు కూడా వద్ద డబ్బులు తీసుకున్నారని కూడా పలువురు నేతలు చెబుతుంటారు. పార్టీ కోసం చేసే విమర్శలు అపార్థం చేసుకుని ఆయన్ని దూరం చేసుకుంది వైసీపీ.
ఎంపికి ధైర్యం, పౌరుషం, రోషం ఉంటే ఈటల లాగ రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేయాలని భరత్ ఎంపిని రెచ్చగొట్టారు. నిజానికి భరత్ రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకుడు కాదు ఎంపి. ఆ విషయం బహుశా భరత్ మరచిపోయినట్లున్నారు. ఇదే సమయంలో ఈటల రాజీనామా విషయాన్ని ప్రస్తావించారు. కేసీయార్ తో వివాదాలు మొదలవ్వగానే ఈటల రాజీనామా చేయలేదు.
చివరకు మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన తర్వాత కూడా రాజేందర్ రాజీనామా చేయలేదని భరత్ మరచిపోయినట్లున్నారు. ఏ పార్టీలో చేరాలో అర్ధంకాక ఎక్కేగుమ్మం, దిగేగుమ్మం లాగ ముందు కొంతకాలం అన్నీ పార్టీల నేతలతో మంతనాలు జరిపారు ఈటల.
బీజేపీ అగ్రనేతలనుండి హామీ వచ్చి, కమలంపార్టీలో చేరిన తర్వాతే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. వర్తమాన రాజకీయాల్లో కూడా ఏ పార్టీలో ఏమి జరుగుతోందో భరత్ కాస్త గమనిస్తుంటే బాగుంటుంది. లేకపోతే తన అజ్ఞాన్ని తానే బయటపెట్టుకున్నట్లవుతుంది.