గంభీరమైన వాతావరణం నెలకొన్నప్పుడు దాన్ని వీలైనంతగా పోగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తారు. అయితే.. కత్తి మీద సాములా ఉండే అలాంటి పరిస్థితిని డీల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. స్థితప్రజ్ఞతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాజమౌళి తాజాగా మాట్లాడిన మాటలు విన్నప్పుడు.. అందుకే కదా ఆయన్ను జక్కన్న అని పిలిచేది.. అన్న భావన కలుగక మానదు. బాలీవుడ్ కు ప్రతిష్ఠాత్మకంగా మారి.. భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రహ్మస్త్రం మూవీని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా రామోజీ ఫిలింసిటీలో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత..పోలీసులు అనుమతికి నో చెప్పటంతో ఈ ఫంక్షన్ వాయిదా వేశారు. సినిమా విడుదలకు సరిగ్గా వారానికి ముందు జరిగే ఈ ఈవెంట్ తో మూవీకి మరింత హైప్ తెచ్చేందుకు సాయం చేసే ఈ వేడుక వాయిదా పడటం అంటే.. రాజమౌళి లాంటి సినిమా వ్యాపారం బాగా తెలిసిన దర్శకుడికి ఎంతటి ఇబ్బంది అన్న విషయం తెలిసిందే.
అయినప్పటికీ అదేదీ ముఖం మీద కనిపించకుండా.. బడబాగ్నిని కడుపులో దాచుకొని ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు వావ్ అనకుండా ఉండలేం. ‘ఈవెంట్ కు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. మీరంతా చూస్తే ఎంతో బాగుంటుందని అనుకున్నా. టీమ్ అంతా చాలా కష్టపడింది. కానీ.. అనుకున్నట్లు జరగలేదు. కరణ్ జోహార్ వినాయక పూజ సరిగా చేసి ఉండరు.అందుకే ఇలా జరిగిందేమో?’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
పోలీసు అధికారుల నుంచి తాము అనుమతి ముందుగా తీసుకున్నప్పటికీ.. గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు ఎక్కువగా ఉండటంతో బందోబస్తు ఏర్పాట్లు చేయలేకపోతున్నట్లుగా చెప్పారని.. దీంతో ప్రోగ్రాంను వాయిదా వేయక తప్పలేదన్నారు. బ్రహ్మాస్త్రం మూవీలో రణ్ బీర్ అద్భుతమైన శక్తులు కలిగి ఉంటారని.. అందుకు తగ్గట్లే ఈ వేడుకలో తారక్ తొడగొడితే ఫైర్ వచ్చేలా ప్లాన్ చేశామని.. దాన్ని ఈ సినిమా సక్సెస్ మీట్ తప్పకుండా చూపిస్తామన్నారు. మొత్తానికి ఇబ్బందికర పరిస్థితుల్లో విషయాల్ని ఎలా డీల్ చేయాలన్న దానికి కేరాఫ్ అడ్రస్ గా జక్కన్న నిలుస్తారని చెప్పక తప్పదు.