టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. స్టూడెంట్ నెం.1తో మొదలుకొని ఆర్ఆర్ఆర్ వరకు ప్లాప్ అంటూ లేకుండా వరుస హిట్ లతో దూసుకుపోతున్న రాజమౌళి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రాఘవేంద్రరావు శిష్యుడినని చెప్పుకునే రాజమౌళి…తన ప్రతి విజయం వెనుక తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని చెబుతుంటారు.
తన తండ్రి అందించిన కథలకు అద్భుతంగా తెరకెక్కించే రాజమౌళి….ఆర్ఆర్ఆర్ తో మరోసారి తమ కాంబినేషన్ ఎంత సక్సెస్ ఫుల్లో చెప్పేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత జక్కన్న పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే జక్కన్నను పలు అవార్డులు వరించాయి. ఆస్కార్ అవార్డులకు ముందు ప్రదానం చేసే గవర్నర్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో జక్కన్న ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రముఖ మ్యాగజైన్ లాస్ ఏంజెలిస్ టైమ్స్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజీలో ఆసక్తికర కథనం ప్రచురించింది.
ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. హాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డును జక్కన్న దక్కించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును రాజమౌళికి అందించారు. అమెరికాలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఆ అవారర్డును రాజమౌళి. ఈ అవార్డును సాధించిన తొలి భారతీయ దర్శకుడు రాజమౌళి కావడం విశేషం.
1935 నుంచి ఈ అవార్డులను ఇస్తుండగా..మరే భారతీయ దర్శకుడు దానిని దక్కించుకోలేదు. వార్తాపత్రికలు, మేగజీన్స్, ఆన్ లైన్ పబ్లికేషన్లకు చెందిన పలువురు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పడి సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ఈ అవార్డులను ఇస్తున్నారు.
ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శాటర్న్, సన్ సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది.