టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి భారతీయ సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన జక్కన్న పేరు అంతర్జాతీయ స్థాయిలోనూ మార్మోగిపోయింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులర్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ లోని పలువురు దర్శకులు, నిర్మాతలు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డులకు ముందు ప్రదానం చేసే గవర్నర్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో జక్కన్న ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రముఖ మ్యాగజైన్ లాస్ ఏంజెలిస్ టైమ్స్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజీలో ఆసక్తికర కథనం ప్రచురించింది. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి ముంగిట భారీ అవకాశాలు అని ఆ కథనంలో రాసుకొచ్చింది. హాలీవుడ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొందిన రాజమౌళి సినిమాకు అమెరికా ఊగిపోతుందని ఆ కథనంలో రాసుకొచ్చింది.
రాజమౌళితో సినిమా చేయాలని పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆఫర్లు ఇచ్చాయని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. దిగ్గజ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ కూడా రాజమౌళితో ఓ సినిమా చేయాలని ఆఫర్ చేసిందని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై రాజమౌళి స్పందించారు. హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్న మాట వాస్తవమేనని, కానీ, హాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేయడం చాలా కష్టమని అన్నారు.
మనమేకింగ్ కు, వాళ్ళ మేకింగ్ కు చాలా తేడా ఉందని జక్కన్న అభిప్రాయపడ్డారు. కొన్ని హాలీవుడ్ సినిమాలను స్టడీ చేయాలని, వాళ్ళ టేకింగ్ మేకింగ్ మెథడ్స్ పై పూర్తి నాలెడ్జ్ లేకుండా సినిమా చేసి హాలిడే ప్రేక్షకులను మెప్పించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అయితే, మహేష్ బాబుతో సినిమా తర్వాత తప్పకుండా హాలీవుడ్ సినిమా చేస్తానని అన్నారు.