టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు జక్కన్న చెక్కుతోన్న పిరియాడికల్ ఫిక్షన్ మూవీ మూవీ సినీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇటీవల విడుదలైన నాటు నాటు పాట ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. జనవరి 7న వరల్డ్ వైడ్ థియాట్రికల్ రిలీజ్ కోసం సిద్ధమవుతోన్న ఈ సినిమాపై ఓ ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. టికెట్ల రేట్ల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆర్ఆర్ఆర్ నిర్మాతలు కోర్టుకు వెళ్లబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై జగన్ తో రామ్ చరణ్, రాజమౌళి, తారక్ భేటీ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ పుకార్లపై ఆ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య స్పష్టతనిచ్చారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం టికెట్ రేట్టు తగ్గించడం వల్ల తమ సినిమాకు ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమేనని, కానీ, తమకు కోర్టుకు వెళ్లే ఉద్దేశ్యం లేదని దానయ్య క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఈ విషయంపై త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితిని వివరిస్తామని, దీని పరిష్కారం గురించి మాట్లాడతామని దానయ్య ట్వీట్ చేశారు.
అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ప్రత్యేక అనుమతులు ఇస్తారా లేదంటే టికెట్ల రేట్లు తగ్గిస్తారా అన్నది తేలాల్సి ఉంది. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదల సమయం నుంచి టికెట్ల రేట్లను ఏపీ సర్కార్ తగ్గించిన సంగతి తెలిసిందే. రేట్ల తగ్గింపుతోపాటు టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ సిస్టం విషయంలోనూ టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు గుప్పించుకోవడం చర్చనీయాంశమైంది.