మునుగోడు ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టిఆర్ఎస్. బిజెపి. కాంగ్రెస్ ల మధ్య మునుగోడులో త్రిముఖ పోరు సాగుతోంది. మునుగోడు బైపోల్ బరిలో టీటీడీపీ కూడా నిలుస్తుందని ప్రచారం జరిగినా చివరకు ఆ నిర్ణయాన్ని టిడిపి విరమించుకుంది. ఈ నేపథ్యంలోనే మునుగోడులో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి…టిడిపి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును రాజగోపాల్ రెడ్డి కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లుగా బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, బిజెపికి మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని, అందుకే ఆయనతో భేటీ అయేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి భేటీ తర్వాత మునుగోడులో బిజెపికి, టిడిపి మద్దతు ఇచ్చే అంశంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకశముంది.
వాస్తవానికి తెలంగాణలో బిజెపికి టిడిపి మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉందని ఢిల్లీ వర్గాల నుంచి కొద్ది రోజుల క్రితమే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందుకు ప్రతిగా ఏపీలో టీడీపీకి సహకరించేందుకు బిజెపి రెడీగా ఉందని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో టిడిపికి ఆంధ్రా పార్టీ అనే బలమైన ముద్ర ఉంది. దీంతో, రాష్ట్ర విభజన తర్వాత టిడిపి మనుగడ కొంత కష్టంగా మారింది.
అయితే టిఆర్ఎస్ తాజాగా బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో టిడిపిని బలోపేతం చేసే ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిజెపితో కలిసి టీడీపీ ముందుకు సాగాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కుదిరితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి, టీటిడిపి మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.