వైసీపీ రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కొన్నేళ్ల నుంచి సినిమాలు తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఎన్నికల తర్వాత అమ్మరాజ్యం కడప బిడ్డలు లాంటి సినిమాలు ఆ లక్ష్యంతోనే తీశాడు వర్మ. ముందు వర్మ మామూలుగానే ఈ సినిమాలు తీస్తున్నాడని అనుకున్నారు. కానీ ఆయనకు వైసీపీ ఫండింగ్ ఇస్తోందని తర్వాత తర్వాతే అర్థమైంది.
కొన్నేళ్ల నుంచి వైసీపీకి వర్మ పెయిడ్ క్యాంపైనర్‌గా మారిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. తన ట్విట్టర్ అకౌంటును ఆయన అద్దెకు ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో టీడీపీని, జనసేనను టార్గెట్ చేస్తూ ఫక్తు పొలిటికల్ ట్వీట్లు పడుతున్నాయి. దాంతో పాటుగా జగన్‌కు ఎలివేషన్ ఇవ్వడం, ఆయన రాజకీయ ప్రత్యర్థులను కించపరచడమే లక్ష్యంగా సినిమాలు కూడా తీస్తున్నాడు వర్మ. ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు అందులో భాగమే.
ఐతే ఇంతకుముందు వర్మ ప్రయత్నాలను తేలిగ్గా తీసుకుంటూ వచ్చిన టీడీపీ.. ఈ మధ్య కౌంటర్ ఎటాక్ చేస్తోంది. అందులో భాగంగానే ‘వ్యూహం’కు వ్యతిరేకంగా నారా లోకేష్ కోర్టుకు వెళ్లడం, ఆ సినిమాకు బ్రేక్ పడటం జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ‘రాజధాని ఫైల్స్’ అనే సినిమా రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల బాధను హృద్యంగానే చూపించినట్లు కనిపిస్తోంది.
ఇది ప్రాపగండా సినిమానే అయినప్పటికీ.. ఎమోషన్ లేకపోలేదు. ఇక వర్మ వైసీపీ రాజకీయ ప్రత్యర్థులను బ్యాడ్ లైట్లో చూపించి జగన్ అభిమానులకు ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంటాడన్న సంగతి తెలిసిందే. నారా లోకేష్‌ను వైసీపీ వాళ్లు సంబోధించే ‘పప్పు’ అనే పేరును సూచించేలా సీన్లు పెట్టాడు తన సినిమాల్లో. అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఇలాంటి వెటకారపు సీన్లే పెట్టాడు. ఐతే ఇప్పుడు ‘రాజధాని ఫైల్స్’లోనూ జగన్‌ను ఉద్దేశించిన పాత్రతో పబ్జీ ఆడించడం, గొడ్డలి పట్టించడం లాంటి సీన్లు.. టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా అనిపిస్తున్నాయి. ఇది వర్మ గిల్లుడికి టీడీపీ వైపు నుంచి జవాబులా అనిపిస్తోంది.