గోషామహల్ ఎమ్మెల్యే, బిజెపి నేత రాజా సింగ్ నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలాగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయింది. ఆ కేసులో భాగంగా రాజా సింగ్ ను గతంలో పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన రాజా సింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలో పాల్గొనకుండా పోలీసులు తనను అడ్డుకున్నారని, ఒకవేళ హనుమాన్ భక్తులు ఆవేశంలో ఏదైనా చేస్తే దాంతో తనకు సంబంధం లేదని పోలీసులను ఆయన హెచ్చరించారు. హనుమాన్ యాత్రకు భారీ బైక్ ర్యాలీ చేపట్టడానికి వెళుతున్న రాజా సింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ ప్రారంభించడానికి ముందే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, తనను ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులతో రాజా సింగ్ వాగ్వాదానికి దిగారు. ఈరోజు హిందువుల పండుగ అని, తన పుట్టినరోజు కూడా అని ఆయన చెప్పారు. తన పేరు హనుమాన్ సింగ్ అని, తన నియోజకవర్గంలో జరిగే హిందువుల కార్యక్రమంలో తాను పాల్గొనకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా తన నియోజకవర్గంలో బైక్ ర్యాలీ జరుగుతుందని అన్నారు.
ఈ ఏడాది తనను అరెస్ట్ చేశారని తెలిసి భక్తులు ఏదైనా విధ్వంసానికి పాల్పడితే తనకు సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేశారు అని తెలిసి హనుమాన్ భక్తులు ఆవేశానికి గురి కావచ్చని, అందుకు తాను జవాబుదారీ కాదని పోలీసులను హెచ్చరించారు.