ఈ మధ్య ఓ వ్యక్తిగత వివాదంతో కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచాడు రాజ్ తరుణ్ . లావణ్య అనే అమ్మాయి తనను ప్రేమించి మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం.. వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం.. ఈ క్రమంలో పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. ఈ గొడవ ఇలా నడుస్తుండగానే రాజ్ నటించిన ‘పురుషోత్తముడు’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం ఆ చిత్రం ప్రేక్షకులను పలకరించింది కూడా.
నిజానికి రాజ్ నటించిన ‘తిరగబడరా సామి’నే ఈ మధ్య వార్తల్లో ఉంది. దాని ట్రైలర్ కూడా లాంచ్ చేశాడు. విడుదలకు రెడీ చేశారు. కానీ అది హోల్డ్‌లో పడింది. ఎక్కడ్నుంచి ఊడిపడిందో అన్నట్లుగా ‘పురుషోత్తముడు’ అనే సినిమా తెరపైకి వచ్చింది. ఉన్నట్లుండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ కూడా వదిలారు. సినిమా కూడా థియేటర్లలోకి దిగేసింది.
కానీ ఎక్కడా రాజ్ తరుణ్ ఈ సినిమా ప్రమోషన్లలో కనిపించలేదు. తాను ‘పురుషోత్తముడు’ పేరుతో ఓ సినిమా చేస్తున్నట్లు కూడా ఇంతకుముందు రాజ్ సోషల్ మీడియాలో వెల్లడించినట్లు లేడు. ఈ చిత్రాన్ని ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. రిలీజ్ టైంలో కూడా ఎక్కడా ప్రమోషన్లలో కనిపించలేదు. దీని గురించి ఒక ట్వీట్ కూడా లేదు. ఈ టైంలో మీడియా ముందుకు వస్తే లావణ్యతో గొడవ గురించి అడుగుతారని భయపడే రాజ్ సైలెంటుగా ఉన్నాడని అనుకోవడానికి లేదు. అదే ఉద్దేశమైతే కనీసం సోషల్ మీడియాలో అయినా సినిమాను ప్రమోట్ చేయాలి.
ఈ సినిమా చూస్తుంటే.. దీని మీద రాజ్‌కు ఏమాత్రం ఆశల్లేకపోవడం వల్లే దీన్ని ఓన్ చేసుకోకుండా వదిలేశాడనే సందేహాలు కలిగాయి. శ్రీమంతుడు, మహర్షి, బిచ్చగాడు, వారసుడు.. ఇలా చాలా సినిమాలను మిక్సీలో వేసి తీసినట్లుగా ఉన్న ఈ చిత్రం.. రాజ్ తరుణ్‌కు అస్సలు సూట్ కాలేదు. ముతక కథ.. బోరింగ్ నరేషన్తో ‘పురుషోత్తముడు’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. మేకింగ్ దశలోనే సినిమా మీద ఆశలు కోల్పోవడంతో దీని వల్ల ఏ ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతోనే రాజ్ ‘పురుషోత్తముడు’ను ప్రమోట్ చేసి ఉండకపోవచ్చని సినిమా చూసిన ఎవ్వరికైనా అర్థమైపోతుంది.