తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార ప్రతిపక్ష నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బిఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్రం నలువైపులా సుడిగాలి పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్…విపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటానని జానారెడ్డి చెప్పారని, కానీ ఆయన మాట మీద నిలబడలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
తాను ముఖ్యమంత్రి అయిన మొదట్లో కరెంటు కష్టాలున్నాయని, కానీ రెండేళ్ల వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి రెండేళ్లు కాదు నాలుగేళ్లలో కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటానని సవాల్ విసిరారని, కానీ ఆ మాట నిలబెట్టుకోకుండా గత ఎన్నికల్లో సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పై పోటీ చేసి ఓడిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని జానారెడ్డి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సాగర్ లో డిగ్రీ కాలేజీ కూడా లేదని, భరత్ ఎమ్మెల్యే అయిన తర్వాతే డిగ్రీ కాలేజీ, హాలియాలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు.
టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల బాగు కోసమని పాలకుర్తి బహిరంగ సభలో కేసీఆర్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల విషయంలో రావాల్సినంత పరిణితి రాలేదని, నాలుగు డబ్బులకో, సీసాలకో ఓట్లు వేయవద్దని కేసీఆర్ కోరారు. తెలంగాణను ఏపీలో కలిపి కాంగ్రెస్ తప్పు చేసిందని, దశాబ్దాలు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. పాలకుర్తికి విమానంలో వచ్చి వెళ్ళే వ్యక్తికి ఓటు వేస్తే లాభం లేదని, ఎర్రబెల్లి దయాకర్ రావును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు.