మాజీ ప్రధాని, దివంతగ నేత ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఇందిరా గాంధీ నియంతలా వ్యవహరించి రాత్రికి రాత్రి దేశం మొత్తాన్ని జైలుగా మార్చారని బీజేపీ నేతలు ఇప్పటికీ విమర్శిస్తుంటారు. 1975-77 మధ్యకాలంలో 21 నెలలపాటు విధించిన ఎమర్జెన్సీపై ఇప్పటికీ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ విచారణ పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆనాడు ఎమర్జెన్సీ విధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాత్రికి రాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించడం ముమ్మాటికీ తప్పేనని తాను భావిస్తున్నానని రాహుల్ షాకింగ్ కామెంట్లు చేశారు.
ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసుతో చర్చ సందర్భంగా రాహుల్ ఆనాటి ఎమర్జెన్సీపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ సమయంలో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వెనక్కు తీసుకున్నారని, ప్రసార మాధ్యమాలపై ఎన్నో నియంత్రణలు అమలయ్యాయని, విపక్ష నేతలను జైళ్లకు కూడా పంపారని రాహుల్ గుర్తు చేసుకున్నారు. ఆనాడు తన నానమ్మ అలా తలచుకుని ఉండవచ్చని, కానీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ భారత రాజ్యాంగాన్ని ఆక్రమించాలని చూడలేదని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ కు ఆ శక్తి కూడా లేదని, తమ పార్టీ దానికి అంగీకరించదు కూడా అని రాహుల్ చెప్పారు.
జీ-23గా పేరున్న కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యాఖ్యలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. యూత్ కాంగ్రెస్తో పాటు విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐలో ఎన్నికలు జరగాలని తాను పట్టుబట్టానని, అందుకే తనపై ఇలా విమర్శలు చేస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని సూచించిన మొదటి వ్యక్తి తానే అన్న రాహుల్…యూత్ వింగ్లో ఎన్నికలు జరగడంతో తాను టార్గెట్ అయ్యానని అన్నారు.
దేశంలో జరుగుతున్న ప్రస్తుత ఘటనలపై చాలా మంది అసంతృప్తితోనే ఉన్నారని, వారందర్నీ ఓ చోట చేర్చడానికి తాము ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్తో సహా మిగిలిన ప్రతిపక్షాలు అధికారం కోసం పోరాడటం లేదని, 2014 తర్వాత తాము దేశ కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఇప్పుడు మాత్రం అలా కాదని, పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.