హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్, పబ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ఏదో ఒక మార్గంలో నగరంలోకి డ్రగ్స్ సరఫరా అవుతుండడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీకెండ్ పార్టీల పేరుతో ఐటీ ఉద్యోగులు, బడాబాబులు, ప్రముఖుల పిల్లలు డ్రగ్స్ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మింగ్ పబ్ పై పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించిన పోలీసులు..పబ్ యజమానితో పాటు పబ్ లో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు ప్రముఖ నటుడు, నిర్మాత కూతురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పబ్‌లో నిర్వహించిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో సదరు పబ్ నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. ఈ పార్టీలో చాలా మంది యువతులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారందరినీ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల వరకు పబ్ నిర్వహించిన కారణంగానే వారిని అదుపులోకి తీసుకున్నారని పైకి చెబుతున్నారు. కానీ, ఈ దాడిలో డ్రగ్స్ కోణం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
విచారణ అనంతరం కొందరిని విడిచిపెట్టగా, పోలీసులు అదుపులో 38 మంది ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ తోపాటు మిగతా కొందరికి కూడా నోటీసులు ఇచ్చి పోలీసులు పంపిచేసినట్లు తెలుస్తోంది. పబ్ లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తమను అకారణంగా అరెస్ట్ చేశారంటూ పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
రాడిసన్ బ్లూ హోటల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు, సిగరెట్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నామని, ఫుడింగ్ ఇన్ మింగ్ పబ్ ను పోలీసులు సీజ్ చేశారని, ఇది రేవ్ పార్టీ కాదని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. పబ్ నిర్వాహకులు అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత కూడా పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ ప్రకారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపారని పేర్కొన్నారు.