ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమయిన సంగతి తెలిసిందే. రెండు రైళ్ళు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో దాదాపు 300 మందికి పైగా మరణించగా…వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ…మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటనపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుండగా…తాజాగా టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఒకటి వివాదాస్పదంగా మారింది.
సైలెంట్ అనే హాలీవుడ్ సినిమా నుంచి రైలు ముందు హీరో చేసే సెటైరికల్ విన్యాసాల వీడియోను రాహుల్ రామకృష్ణ తన ట్విటర్ ఖాతాలో సేర్ చేశాడు. దీంతో, ఆ ట్వీట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఘటనపై రాహుల్ ఈ రకంగా ట్వీట్ చేయడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. సంతాపం వ్యక్తం చేయవలసింది పోయి ఆ ఘటనపై సరదాగా ఫన్నీ వీడియోలు ట్వీట్ చేయడం ఏమిటని రాహుల్ తీరుపై మండిపడుతున్నారు.
అయితే, తన ట్వీట్ వివాదాస్పదం కావడంతో రాహుల్ రామకృష్ణ స్పందించారు. తనకు ఒడిశా ప్రమాద ఘటన గురించి తెలియదని, గత రాత్రి నుంచి తాను స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. తన ట్వీట్ ను తొలగిస్తున్నానని, ఈ వ్యవహారంపై బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. దీంతో, నెటిజన్లు కూడా రాహుల్ వివరణపై సంతృప్తి చెంది సైలెంట్ అయిపోయారు.