ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఆయన్ను ఎంపీగా అనర్హత విధిస్తూ కింది కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్దరణ కార్యక్రమాలు వేగంగా జరిగిపోయాయి.
రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్ సభ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని 10, జన్ పథ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్ సభ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాహుల్ లోక్ సభకు హాజరు కానున్నారు. మరోవైపు ఆగస్టు 8న (మంగళవారం) మోడీ సర్కారు మీద ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద లోక్ సభలో చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చర్చలో రాహుల్ కూడా పాల్గొంటారు.
ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్.. ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తన వాణిని బలంగా వినిపించే అవకాశం దక్కిన నేపథ్యంలో ఎంతలా చెలరేగిపోతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోక్ సభలో ప్రవేశ పెట్టిన ఆవిశ్వాస తీర్మానం చర్చలో రాహుల్ ప్రసంగంపై ప్రత్యేక ఆసక్తి వ్యక్తమవుతోంది.
2019 సార్వాత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేయటం.. దీనిపై కోర్టును ఆశ్రయించగా.. రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వటం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జైలుశిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.