ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తెలంగాణలోని మహబూబ్ నగర్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కలవడం చర్చనీయాంశమైంది. అయితే, చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలన్న ఉద్యమానికి మద్దతుగా తాను ఎంపీల సంతకాలు సేకరిస్తున్నారని, అందుకే రాహుల్ ను కలిశానని పూనమ్ వివరణనిచ్చారు.
అయితే, పాదయాత్ర సందర్భంగా పూనమ్ చేయి పట్టుకొని రాహుల్ గాంధీ నడిచిన వీడియో వైరల్ అయింది. దీంతో, ముత్తాత అడుగుజాడల్లోనే రాహుల్ గాంధీ నడుస్తున్నాడు అంటూ నెహ్రూను ఉద్దేశించి బిజెపి నేత ప్రీతి గాంధీ సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై పూనమ్ స్పందించారు. ఇది చాలా అవమానకరమని, తాను జారి పడపోతే రాహుల్ గాంధీ తన చేయి పట్టుకున్నారని పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ సురేఖ కూడా స్పందించారు. రాహుల్ గాంధీ కావాలని ఆమె చేయి పట్టుకోలేదని కొండా సురేఖ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవిస్తుందని, ఇందిరా గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు మహిళలను తల్లిలాగే చూసే పార్టీ తమదని అన్నారు. ఏమైనా తప్పులుంటే వేలెత్తి చూపాలని, అంతేగానీ ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేయకూడదని, బిజెపి నేతలు చిల్లర రాజకీయాలను మానుకోవాలని కొండా సురేఖ హితవు పలికారు.