సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి యాదవ్ తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పార్టీ తరపున కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేయటానికి రెడీ అవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అద్యక్షుడిగా పనిచేసిన రఘువీరా తర్వాత రాజకీయాల నుండి తప్పుకున్నారు. దాదాపు నాలుగేళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితమైపోయారు. తన సొంతూరిలో దేవాలయాల పునరుద్ధరణ, విగ్రహాల ప్రతిష్ట తదితర కార్యక్రమాలకే పరిమితమయ్యారు.
అలాంటిది తాజాగా మళ్ళీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవ్వాలని అనుకున్నారు. ఇందుకు కర్నాటక ఎన్నికలను వేదికగా చేసుకోబోతున్నారు. కర్నాటక ఎన్నికలంటే అనంతపురం, కర్నూలు జిల్లాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే కర్నాటకలోని చాలా మండలాలు అనంతపురం జిల్లాతో సరిహద్దులను పంచుకుంటాయి. కాబట్టి రెండువైపుల నుండి జనాల రాకపోకలు రోజు జరుగుతునే ఉంటాయి. మడకశిర, కల్యాణదుర్గం నియోజకవర్గాల నుండి గెలిచిన రఘువీరాకు కర్నాటకతో విడదీయరాని సంబంధాలున్నాయి.
అందుకనే ఇపుడు ఎన్నికల సమయంలో పార్టీకి తన అవసరం ఉందని గుర్తించారు. బీజేపీ ప్రభుత్వం సోనియాగాంధి, రాహుల్ తదితరులపై కక్షసాధింపు చర్యలకు దిగటాన్ని తాను సహించలేకపోతున్నట్లు చెప్పారు. మంగళవారం జిల్లాలోని తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి క్రియాశీలం కాబోతున్నట్లు ప్రకటించారు. కర్నాటక ఎన్నికల్లో తాను పార్టీ తరపున విస్తృతంగా పర్యటించబోతున్నట్లు చెప్పారు. 1989 నుండి కర్నాటక ఎన్నికల్లో తాను సుమారు 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
కర్నాటకలో తనకున్న సన్నిహిత సంబంధాలను పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం ఉపయోగించబోతున్నట్లు చెప్పారు. సిరా, పావగడ, కొరటికేరి, మధుగిరి, చిత్రదుర్గ, తుంకూరు, బాగేపల్లి, గౌరిబిదనూరు ప్రాంతాల్లో పర్యటించబోతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతలు, అభ్యర్ధులు కూడా ప్రచారానికి రావాలని ఆహ్వానించిన విషయాన్ని రఘువీరా చెప్పారు. కాబట్టి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న నేపధ్యంలో కర్నాటక ఎన్నికలు రావటం కాకతాళీయమన్నారు. మొత్తానికి ఒక గట్టినేత కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అవ్వటం పార్టీకి మంచిదే కదా. మరి కర్నాటక ఎన్నికల్లో రఘువీరా ప్రభావం ఏమాత్రం ఉంటుందో చూడాల్సిందే.