ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో సమావేశమైన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికల గురించి జగన్ చర్చలు జరిపారని పుకార్లు వస్తున్నాయి. అయితే, ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేవని సజ్జలతో పాటు మరికొందరు వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు.
ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీతో జగన్ ముందస్తు ఎన్నికల గురించి చర్చించారని రఘురామ వెల్లడించారు. అమెరికాలో TANA సభలలో పాల్గొనందుకు వెళ్లిన రఘురామ వీడియో సందేశం ద్వారా స్పందించారు. ఎన్టీఏలో చేరేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, కానీ తెలంగాణతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సూత్రప్రాయంగా బీజేపీ పెద్దలు అంగీకరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, ముందస్తు ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టించేందుకే ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల, కారుమూరి వంటి నేతలు అటువంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
టీవీ ఛానల్ కు లీకులిచ్చిందీ వైసీపీ నేతలేనని, మళ్లీ వాటిని నమ్మొద్దు అంటూ ప్రకటన విడుదల చేసిందీ వారేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటువంటి కన్ఫ్యూజింగ్ ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రతిపక్షాలు ఎన్నికలకు ప్రిపేర్ కాకుండా చేయడమే వారి లక్ష్యం అని ఆరోపించారు. నిజాన్ని అతి పొదుపుగా వాడే వ్యక్తులలో జగన్ ఒకరని విమర్శలు గుప్పించారు. జగన్ చెప్పే పని ఏది చేయరని, ముందస్తు ఎన్నికలు కూడా ఆకోవలోకే వస్తాయని రఘురామ అన్నారు. ముందస్తు ఎన్నికలు లేవు అని జగన్ అంటే కచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని అనుకోవచ్చని అన్నారు.
అందుకే ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని, ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై మరింత సమాచారం బట్టబయలవుతుందని రఘురామ చెప్పారు. మరోవైపు, ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, నియోజకవర్గాలవారీగా నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యేందుకు సన్నాహాలు మొదలుబెట్టారు.