డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా ఏపీ ప్రభుత్వం మార్చిన వ్యవహారంపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ సతీమణిగా చలామణి అవుతున్న లక్ష్మీపార్వతి చాలా లేటుగా స్పందించారు. ఆ స్పందన కూడా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఉంది. ఆ యూనివర్సిటీ పేరులో నుంచి అన్నగారి పేరును తొలగించడాన్ని ఖండించాల్సిన లక్ష్మీపార్వతి అందుకు భిన్నంగా తమ ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు పలికారు.
దీంతో, లక్ష్మీపార్వతిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీపార్వతిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీపార్వతి స్పందనను ఆనాటి టీడీపీ సంక్షోభంతో రఘురామ ముడిపెట్టి పదునైన విమర్శలు గుప్పించారు. బహుశా ఆనాడు వైశ్రాయ్ హోటల్ వద్ద లక్ష్మీపార్వతిపై టీడీపీ నేతలు చెప్పులు వేసి ఉంటారని రఘురామ అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
లక్ష్మీపార్వతి స్పందించిన తీరుతో ఆ సంక్షోభంపై ఉన్న అనుమానాలు తొలగిపోయి ఉంటాయని రఘురామ అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చినందుకు నిరసనగా కనీసం రాజీనామా చేస్తానని మాటవరసకు కూడా లక్ష్మీపార్వతి అనగా పోవడం ఆమె నైజానికి నిదర్శనం అని రఘురామ మండిపడ్డారు. ఎన్టీఆర్ కు అది చేశారు ఇది చేశారు అని లక్ష్మీపార్వతి ఊదరగొడుతుంటారని, కానీ అంతకంటే ముందు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి బాబాయికి గొడ్డలి పోటు వేసింది ఎవరు అని ఆమె పరిశీలించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక, యూనివర్సిటీ పేరు మార్పును జగన్ సోదరి షర్మిల కూడా తప్పుబట్టారని, ఈ విషయంలో జగన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని రఘురామ హితవు పలికారు. పేరు మార్పుపై జగన్ వెనక్కు తగ్గుకుంటే ప్రభుత్వాన్ని మార్చడంలోనూ ప్రజలు వెనక్కి తగ్గరని రఘురామ హెచ్చరించారుజ ఎన్టీఆర్ స్థాయి ఒక అర జిల్లా కాదని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను రఘురామ సమర్థించారు. ఎన్టీఆర్ తన పిల్లలకు ఆస్తులను మాత్రమే పంచారని, కానీ, వైయస్సార్ మాదిరిగా రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేయలేదని విమర్శలు గుప్పించారు.