జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనాన్ని కొన్ని గుర్తు తెలియని వాహనాలు వెంబడిస్తున్నాయని, ఆయనను కొందరు ఆగంతకులు వెంబడిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ను హతమార్చేందుకు కిరాయి హంతకులకు సుపారీ ముట్టిందని, దాదాపు 250 కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉండటంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మండిపడ్డారు. తాజాగా, పవన్ భద్రతపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పవన్ కు తగిన భద్రత కల్పించాలని రఘురామ లేఖ రాశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తన లేఖ అందినట్లుగా వచ్చిన అకనాల్జ్ మెంట్ కాపీని కూడా రఘురామ ట్విట్టర్లో షేర్ చేశారు.
పవన్ కు కొద్దిరోజులుగా ఎదురవుతున్న వరుస ఘటనలకు సంబంధించిన వివరాలను ఈ లేఖలో అమిత్ షాకు ఆయన వివరించారు. గత నెల 21న, ఈనెల 1న హైదరాబాద్ లోని పవన్ నివాసం వద్ద గుర్తు తెలియని వాహనాలు, వ్యక్తులు తచ్చాడడాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు, పవన్ బౌన్సర్లతో ఆ గుర్తు తెలియని వ్యక్తులు గొడవకు కూడా దిగారని రఘురామ పేర్కొన్నారు. ఇక విశాఖపట్నం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఎదురైన అనుభవాలను కూడా ఈ లేఖలో రఘురామ ప్రస్తావించారు. పవన్ కు రక్షణ కల్పించాలని కల్పించాలని కోరారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా స్పందించారు. పవన్ కు తగినంత భద్రత కల్పించాలని, పవన్ కు ప్రాణహాని ఉన్నట్టు వార్తలు వస్తున్నా ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే పవన్ భద్రతను పట్టించుకోరా అని నిలదీశారు. వైసిపి కార్యకర్తల మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తున్నారని సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్తామని, అమిత్ షా, కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసి ఏపీ పోలీసుల తీరిపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. పవన్ కు తక్షణమే భద్రత పెంచాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు.