వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు కొద్ది సంవత్సరాల క్రితం అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఒక ఎంపీ అని కూడా చూడకుండా అర్ధరాత్రి రఘురామను అరెస్టు చేయడం పెను దుమారం రేపింది. అంతేకాదు, ఆ తర్వాత తనను సీఐడీ పోలీసులు కస్టడీలో కొట్టారని రఘురామ ఆరోపించడం, వైద్య పరీక్షలలోనూ అదే విషయం తేలడంతో జగన్ సర్కార్, ఏపీ సీఐడీ పోలీసుల తీరు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే రఘురామ కస్టోడియల్ టార్చర్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ రఘురామ తనయుడు భరత్ గతంలో దేశపు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై తాజాగా నేడు జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది.
అయితే, ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు 2 వారాల గడువు కావాలని భరత్ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు కోరారు. దీంతో, కోర్టు అందుకు సమ్మతిస్తూ ఆ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. రఘురామరాజును రెండున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతోందని, తన సొంత నియోజకవర్గం నర్సాపురంలోకి కూడా ఆయనను అడుగుపెట్టనీయకుండా ప్రభుత్వం అడ్డంకులు కల్పించిందని ఆయన కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సీఐడీ కస్టడీలో రఘురామపై టార్చర్ జరిగిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని కూడా ఆయన వాదించారు. కానీ, ఆదినారాయణరావు వాదనతో సుప్రీం కోర్టు విభేదించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాదన విన్న తర్వాతే సీబీఐ విచారణకు ఆదేశించాలా? వద్దా? అన్న విషయంపై దృష్టిసారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో, సుప్రీం కోర్టులో రఘురామకు చుక్కెదురైనట్లయింది.