సీఎం జగన్ కు, వైసీపీ నేతలకు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా మారిన సంగతి తెలిసిందే. దీంతో, ఆర్ఆర్ఆర్ పై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఏడాదిగా చెప్పులరిగేలా తిరుగుతున్నప్పటికీ…రఘురామపై అనర్హత వేటు వేయించే విషయంలో జగన్ అండ్ కో కు చుక్కెదురవుతూనే ఉందన్న సంగతి తెలిసిందే.
ఇక, చివరకు తనపై అనర్హత వేటు వేయించేందుకు తోటి ఎంపీలు పడుతున్న తిప్పలు చూసి చలించిపోయిన ఆర్ఆర్ఆర్…వారందరికీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5లోపు తనపై అనర్హత వేటు వేయించాలని, ఒకవేళ అలా చేయడం వైసీపీ నేతలకు చేతకాకుంటే తానే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని అన్నారు. అయితే, ఇక్కడ సవాల్ చేసిన రఘురామ ఢిల్లీ పారిపోయారని ఎంపీ విజయసాయి చేసిన కామెంట్లపై ఆర్ఆర్ఆర్ స్పందించారు.
తనపై అనర్హత వేటు వేయించలేమని వైసీపీ నేతలు ఒప్పుకుంటే… ఇప్పటికిప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ రఘురామ సవాల్ విసిరారు. చాలాకాలంగా తాను ఢిల్లీలోనే ఉంటున్నానని, ఇప్పుడు కూడా ఢిల్లీలోనే ఉన్నానని చెప్పారు. దానికి వైసీపీ నేతలు తాను పారిపోయానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలా అయితే, గత రెండున్నరేళ్లుగా జగన్ కోర్టుకే రావడం లేదని, దానికి ఏమంటారని ప్రశ్నించారు.బండి సంజయ్ విషయంలో ఒకలా, తన విషయంలో ఒకలా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ వ్యవహరిస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మరి, వైసీపీ నేతలు రఘురామ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.