వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. తన రాజీనామాకు.. సీఎం రాజీనా మాకు లింకు పెట్టేశారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన ట్విస్ట్పై నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించేందుకు అవకాశం ఇస్తున్నట్లు… ఆర్ ఆర్ ఆర్ తెలిపారు.
అప్పటి వరకు అనర్హత వేటు వేయించకపోతే.. రాజీనామా చేస్తానని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్తానని, భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గెలవకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
అయితే.. తాను గెలిస్తే మాత్రం సీఎం జగన్ రాజీనామా చేయాలని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని.. రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రెండు రోజులు.. పోలీసులు తనకు భద్రత కల్పించాలన్నారు.
అధికారులు తన ప్రతి కదలికనూ వీడియో తీస్తారని చెప్పారు. రెండు రోజులూ ఇంటి వద్దనే ఉండి వచ్చిన వారిని పలకరించి పంపుతానని ఎంపీ చెప్పారు. అమరావతి కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల అందోళనకు.. ఎంపీ రఘరామ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సచివాలయ ఉద్యోగులను.. మండల రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేసులు పెడితే.. భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో.. రేషన్, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసేశారని మండిపడ్డారు. ఏటా జనవరిలో ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించిన రఘురామ.. రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. మద్యం తయారీలో ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ మరో సలహదారునిగా జ్ఞానేంద్ర రెడ్డిని నియమించారని, ఆయన వల్ల ఉపయోగం ఏంటని ఎంపీ ప్రశ్నించారు. ప్రభుత్వానికి అదనపు ఖర్చు తప్ప.. ఎలాంటి ప్రయోజనమూ లేదని దుయ్యబట్టారు. సీఎం జగన్.. ఒకే సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీఠ వేస్తున్నారని ఆరోపణలు చేశారు. మిగిలిన సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.