నిన్న రాత్రి నుంచి రఘురామరాజు స్ట్రెచర్ పై పడుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన కాలికి పీవోపీ కట్లు వేశారు. దీంతో వారం రోజుల పాటు రఘురామరాజు నడవలేరని వైద్యులు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ రఘురామరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెరుపు వేగంగా రఘురామరాజు కోర్టులను ఆశ్రయించడంతో ఆయనకు బెయిలు వచ్చింది.
పోలీసుల అరెస్టుకు కొద్ది రోజుల ముందే జగన్ ఏపీని అముల్ కు ధారాదత్తం చేస్తున్నాడని ఒక పిటిషను, జగన్ బెయిల్ రద్దు చేయాలని మరో పిటిషను రఘురామరాజు కోర్టుల్లో వేశారు.
ఆ కోపంతో సీఐడీ చేత అరెస్టు చేయించారని రఘురామ అభిమానులు ఆరోపిస్తున్నారు. కానీ సీఐడీ మాత్రం రఘురామరాజు జగన్ ను తిట్టినందుకు అరెస్టు చేసినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.
కట్ చేస్తే… ఈ అరెస్టు కంటే కూడా అరెస్టు చేసి తమ కస్టడీలో ఉంచినపుడు తనను చితకబాదారని రఘురామరాజు సంచలన ఆరోపణలు చేశారు. అందువల్లే తనకు దెబ్బలు తగిలి కాళ్లు వాచాయని అన్నారు.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లడం, తర్వాత రఘురాముడిని సుప్రీంకోర్టు తెలంగాణ ఆర్మీ ఆస్పత్రికి తరలించడం, వాళ్లు ఆయన కాళ్లలో ఫ్రాక్చర్లు ఉన్నాయని, పాదాలు గాయపడ్డాయని చెప్పడం తెలిసిందే.
దాని ఆధారంగానే రఘురామరాజుకు బెయిలు వచ్చింది. అయితే, తాజాగా సికింద్రాబాద్ లోని సైనిక ఆసుపత్రి రఘురామకు గాయాలు అయినట్టు ఎక్కడా చెప్పలేదని ఏపీ సీఐడీ చెబుతోంది.
రఘురామను గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరచడానికి ముందు జారీ చేసిన ఫిట్నెస్ ధ్రువపత్రం, గుంటూరు జీజీహెచ్ వైద్యుల బృందం హైకోర్టుకు ఇచ్చిన నివేదిక, గుంటూరు జిల్లా జైలు డ్యూటీ డాక్టర్ ఇచ్చిన నివేదికలోనూ ఎక్కడా రఘురామకు గాయాలు ఉన్నట్టు పేర్కొనలేదని వివరించింది.
గుంటూరు ఆస్పత్రికి తప్పుడు నివేదికపై కోర్టు నోటీసు ఇవ్వడం ఇక్కడ మనం మర్చిపోకూడదు.
అయితే, సీఐడీ చెప్పిన మాటల్లో ఒకటి మాత్రం నిజం. సైనిక ఆసుపత్రి గాయాలున్నాయని చెప్పింది గానీ… కస్టడీలోనే గాయాలు అయినట్టు రిపోర్టులో పేర్కొనలేదు. దీనికి కారణం ఏంటంటే… ఒక గాయం ఎలా ఉందో తెలుస్తుంది గాని ఎక్కడ అయ్యిందో, ఎలా అయ్యిందో తెలియదు.
అందుకే సైనికాసుపత్రి గాయాలను మాత్రమే ధ్రువీకరించింది. మరి తప్పుడు నిర్ధారణలతో ప్రచారాలు చేయడం సరికాదని ఏపీ సీఐడీ హెచ్చరించడం ఇపుడు కాస్త ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకీ రఘురామకు గాయాలు ఎలా అయ్యాయో సీఐడీ అయినా చెబితే బాగుంటుంది కదా.