ఏపీలో వైసీపీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కొరకరానికొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఓ పక్క తాను వైసీపీకి చెందిన ఎంపీనంటూ….మరో పక్క వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తున్న ఆర్ఆర్ఆర్….అధికార పార్టీకి పక్కలో బల్లెంలా మారారు. రఘురామను సస్పెండ్ చేయలేక….అలా అని ఆయన విమర్శలకు తీవ్ర స్థాయిలో బదులివ్వలేక చాలా సందర్భాల్లో వైసీపీ నేతలు కిమ్మనకున్నారు.
ఇక, ఏడాదిగా రఘురామ ఎపిసోడ్ నడుస్తున్నా కూడా జగన్ ఆయన విషయంలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ నేతలపై రఘురామ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి రఘురామ షాక్ ఇచ్చారు. తన హక్కులకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పీఎంవోలో కూడా తన సమస్యలపై ఫిర్యాదు చేస్తానని, రెండ్రోజుల్లో స్పీకర్ ను,సింగ్ ను వ్యక్తితగంగా కలిసి విషయాన్ని వివరిస్తానని అన్నారు. తనపై జరుగుతున్న అరాచకాలను, దౌర్జన్యాలను వారి దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. ఏపీలో దమనకాండపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని, ఏపీలో రెడ్లి రాజ్యమా.. ప్రజారాజ్యమా అని ఆయన మండిపడ్డారు. రెడ్డియేతర సామాజిక వర్గాలను తొక్కేస్తారా అని ప్రశ్నించారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విజయసాయిరెడ్డి అణగదొక్కుతున్నారని ఆరోపించారు. తన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రా యూనివర్సిటీలో విజయసాయిరెడ్డి.. రెడ్డి కుల సభ నిర్వహించారని, వీసీ ప్రసాదరెడ్డిని పదవి నుంచి గవర్నర్ తొలగించాలని డిమాండ్ చేశారు. మరి, రఘురామ వ్యాఖ్యలపై గవర్నర్, వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది