ఏపీ రాజధాని అమరావతి అంటూ హైకోర్టు కొద్ది నెలల క్రితం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు, 6 నెలల లోపు అమరావతి రాజధానిలో నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేయాలని ఆదేశించింది. కానీ, కోర్టు ఆదేశాలతో మాకేం పని అన్న రీతిలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. హైకోర్టు నిర్ణయం నచ్చకపోతే దానిపై అప్పీలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం కానీ చేయలేదు.
అవేమీ చేయకుండానే తాజాగా వైసీపీ నేతలు మరోసారి మూడు రాజధానుల పాట పాడుతున్నారు. అంతేకాదు, నేటి నుంచి ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మూడు రాజధానులకు సంబంధించిన కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు జగన్ రెడీ అయ్యారని టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై, వైసీపీ నేతలపై రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు.
జనాలను మోసగించేందుకే మూడు రాజధానుల బిల్లును మరోసారి శాసనసభలో ప్రవేశపెడుతున్నారని రఘురామ మండిపడ్డారు. అమరావతి రాజధానిపై ఇప్పటికే హైకోర్టు తీర్పునిచ్చిందని, ఆ తీర్పు నచ్చకుంటే ప్రభుత్వం కనీసం అప్పీలుకు కూడా వెళ్లలేదని రఘురామ దుయ్యబట్టారు. అటువంటి వైసీపీ నేతలు సడన్ గా మూడు రాజధానులంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల మధ్య, వర్గాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని రఘురామ మండిపడ్డారు. అయితే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలపై ప్రతిపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని రఘురామ సూచించారు.
ఒకవేళ ప్రభుత్వానికి భయపడి వారిపై పోలీసులు కేసు నమోదు చేయకుంటే మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేయాలని కూడా సలహా ఇచ్చారు. ఇక, గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీని జైలు పార్టీ అని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ కన్నబాబు మళ్లీ పార్టీ మారితే ఆయన విమర్శించే ప్రాధాన్యత కూడా మారిపోతుందేమో అంటూ ఎద్దేవా చేశారు.