అమరావతిలో జగనన్న ఇళ్ల కోసం ఆల్రెడీ 1134.58 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. దానికి అదనంగా ఎస్3 జోన్ లో మరో 268 ఎకరాలు కేటాయించాలని తాజాగా సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదని, ఈ వ్యవహారంపై అమరావతి రైతులు సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నప్పటికీ హడావిడిగా భూముల కేటాయింపు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్, వైసీపీ నేతలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములలో 1134 ఎకరాలు ప్రభుత్వానికి సీఆర్డీఏ అమ్మేసిందని, దానికి అదనంగా ఇప్పుడు మరో 268 ఎకరాలు అమ్మబోతోందని మండిపడ్డారు. అసలు నీకు బుద్ధుందా జగన్ మోహన్ రెడ్డి అని రఘురామ ప్రశ్నించారు. విశాఖకు రాజధాని తీసుకువెళ్తానని చెబుతున్న జగన్ ఇక్కడ ఇళ్ల స్థలాలు ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
జగన్ కలల రాజధాని విశాఖపట్నంలో స్థలాలు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. జగన్ కు బుర్ర దొబ్బిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని సర్వనాశనం చేసే ఉద్దేశంతో, మంగళగిరి ఓటర్లను మభ్యపెట్టేందుకు ఇలా స్థలాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. కడప రెడ్లంతా మిడత దండులా పడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ఇక రైతులు ఉపేక్షించి లాభం లేదని అన్నారు. ఈ వ్యవహారంపై అమరావతి రైతులు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 15 లోపు ఆ స్థలాలు పంచేసేందుకు జగన్ రెడీ అయ్యారని, కానీ, అక్కడ ఇళ్లు కట్టరని, కేవలం స్థలాలు పంచి మైలేజీ దండుకుంటారని విమర్శించారు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు…. రైతులు నీకు ఫోన్ చేసి జగనన్నకి చెబుతామనాలా అంటూ ఎద్దేవా చేశారు. నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వారం రోజుల పాటు చంద్రబాబు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మకాం వేశారని, ఈ రోజు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారని అన్నారు.