సీఎం జగన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లపై ఐప్యాక్ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. జగన్, నితీష్ వంటి వారికి సాయం చేసే బదులు కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కృషి చేసి ఉంటే బాగుండేదని పీకే పశ్చాత్తాపపడిన వైనం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఇప్పటికైనా జగన్ కు పదవి కట్టబెట్టేందుకు తాను అనవసరంగా శ్రమించానని పీకే గుర్తించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తదితరులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పీకే కామెంట్లపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. మూడేళ్ల తర్వాత జగన్ విషయంలో పీకే రియలైజ్ అయినందుకు సంతోషంగా ఉందని రఘురామ అన్నారు. జగన్ అసలు రంగు గుర్తుపట్టేందుకు తనకు ఎనిమిది నెలలు పట్టిందని, బహుశా ప్రజలకు ఇంకొంత సమయం పడుతుందేమో అని రఘురామ చురకలంటించారు. ఈ పాటికి రాష్ట్రంలోనే చాలామంది ప్రజలకు జగన్ నిజస్వరూపం ఏంటో అర్థమైందని అన్నారు.
అయితే, పీకేలో సడెన్ గా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో తనకు తెలియదని రఘురామ చెప్పుకొచ్చారు. ఇక, అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయకూడదు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ చేసిన వ్యాఖ్యలను రఘురామ ప్రస్తావించారు, ఆన్లైన్ విద్యాసంస్థ బైజూ సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధించాలన్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.
బైజూస్ దివాలా తీసిన సంస్థ అని, ఆ పేరుతో ఏపీలో విద్యా వ్యవస్థను జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఇక, వైఎస్ వివేకా హత్యపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. బాబాయి హత్యపై టిడిపి నేత పట్టాభి పది ప్రశ్నలు సంధించారని, వాటికి జగన్ సమాధానం చెప్పి తీరాల్సిందేనని రఘురామ డిమాండ్ చేశారు.