2019లో సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత తన పాలనను విధ్వంసంతో మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఉండవల్లి కరకట్టపై నాటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూల్చేయడం సంచలనం రేపింది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహించేందుకు రూ.8 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని ధ్వంసం చేయించారు జగన్. అయితే, కేవలం చంద్రబాబు కట్టించారనే కారణంతో, ఆయన ఇంటికీ సమీపంలో ఉందన్న నేపథ్యంలోనే జగన్ దాన్ని టార్గెట్ చేశారని విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రజావేదిక కూల్చివేతపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు ప్రజావేదిక కూల్చివేతకు లింక్ పెట్టారు రఘురామ. ఆ కుంభకోణంలో రోహిత్ రెడ్డి, పినాక శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు ముగ్గురూ సూత్రధారులని ఆరోపణలు వస్తున్నాయని రఘురామ ఆరోపించారు. భారీ పెట్టుబడితో అడాన్ డిస్టలరీని ప్రారంభించారని గుర్తు చేశారు.
ప్రజావేదిక, అన్నా క్యాంటీన్ లను కూల్చిన విధంగానే చంద్రబాబు ఇచ్చిన డిస్టిలరీని కూడా జగన్ కూల్చేయవచ్చు కదా? అని రఘురామ ప్రశ్నించారు. జగన్ అలా చేయరని, డబ్బులు వస్తాయి కాబట్టే దానిని కూల్చరని రఘురామ సెటైర్లు వేశారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని, అడాన్ డిస్టిలరీకి రూ. 200 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారని వివరాలు బట్టబయలు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు, వారి అనుయాయుల పాత్ర ఎప్పటికైనా బయటపడుతుందని జోస్యం చెప్పారు. ఏపీలో మద్యం అమ్మకాలలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరగడం లేదని, కేవలం నగదు రూపంలో మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు. అయితే, ఆ డబ్బంతా ఎక్కడకు తీసుకెళ్తున్నారనే విషయంపై కేంద్రానికి లేఖ రాస్తానని రఘురామ అన్నారు.