సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. తమను, తమ పార్టీ అధినేతను విమర్శిస్తోన్న రఘురామపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హోదా కోసం పోరాటం అంటూ పార్లమెంటును స్తంభింపజేస్తూ…తెర వెనుక మాత్రం రఘురామ సస్పెన్షన్ కోసం పోరాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక, పార్లమెంటులో లాభం లేదనుకున్న విజయసాయిరెడ్డి…మరో అడుగు ముందుకు వేసి రఘురామ అవినీతిపరుడంటూ రాష్ట్రపతికి లేఖలు కూడా రాశారు. ఈ నేపథ్యంలో జగన్, విజయసాయిలపై రఘురామ మండిపడ్డారు.
తాను సీఎం జగన్, విజయసాయిలను విమర్శించడం లేదని, అవినీతి కేసులో బెయిల్ పై ఉన్న A1, A2 లను మాత్రమే విమర్శిస్తున్నానని చురకలంటించారు. 16 నెలల జైలు శిక్ష అనుభవించి…10 సంవత్సరాలనుంచి బెయిల్ పై ఉన్నవారా తనపై అవినీతి ఆరోపణలు చేసేది? అని ఆర్ఆర్ఆర్ మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేయడానికి సిగ్గనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. వారి గురించి మాట్లాడాలంటే…తనకు సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు. తాను సీఎం జగన్ ను అనడం లేదని…సీఎం అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని స్పష్టం చేశారు. జగన్ ప్రధాని స్థాయికి వెళతారని ఆ పార్టీ నూజివీడు ఎమ్మెల్యే వెంకట్ ప్రతాప్ అప్పారావు అన్నారని, ఏపీలో మరో 30 ఏళ్లు జగనే సీఎం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారని గుర్తు చేశారు.
దేశంలో నాలుగు భాషలు మాట్లాడగలిగే సీఎం జగన్ ఒక్కరే అని వారు అంటున్నారని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను ఓ ప్రముఖ న్యూస్ యాప్ లో పోస్ట్ చేస్తే 600 లైక్ లు, 1800 డిస్ లైకులు వచ్చాయని అన్నారు. జగన్ మనసు దోచుకునే ప్రయత్నంలో భాగంగా 40 ఏళ్లు జగనే సీఎంగా ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. ఆ డిస్ లైకులు చూస్తుంటే నానాటికీ జగన్ గ్రాఫ్ పడిపోతోందన్న విషయం స్పష్టమవుతోందని, ట్రెండ్ ఇలాగే ఉంటే… ఇప్పటి ప్రతిపక్ష స్థానంలో మనం ఉండాల్సి వస్తుందని చురకలంటించారు. స, షలు అటు ఇటుగా ఉన్నా…తెలుగు మాట్లాడతారని, జగన్ ఇంగ్లిస్ ఫైన్ అని అన్నారు. హైదరాబాద్ లో చదువుకున్న జగన్ కు హిందీ కూడా వచ్చేమో తనకు తెలీదని, ఆ నాలుగో భాషేమిటో తనకు తెలీదని, ప్రతాప్ వెంకట్ ను అడిగి తెలుసుకుంటానని అన్నారు.