జగన్ మూడున్నర సంవత్సరాల పాలనలో పార్టీలో నర్సాపురం ఎంపీ రఘురామ రూపంలో తొలి రెబల్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరింత మంది వైసీపీ నేతలు పార్టీలో ఉంటూనే జగన్ పై గతంలో పరోక్షంగా ధిక్కార స్వరం వినిపించేవారు. అయితే, తాజాగా నెల్లూరులో కోటం రెడ్డి, ఆనంలు బహిరంగంగానే ఈ సారి జగన్ అండ్ కో పై విమర్శనాస్త్రాలు సంధించడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెబల్స్ వ్యవహారంపై వైసీపీ తొలి రెబల్ ఎంపీ రఘురామ స్పందించారు.
ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి, ఆనంల తిరుగుబాటు వ్యవహారంపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు పార్టీలో అవమానాలు పడుతూ చాలామంది బాధను దిగమింగుకున్నారని, అటువంటి వారంతా ఆత్మగౌరవంతో తిరగబడే రోజులు మొదలయ్యాయని అన్నారు. నెల్లూరులో ఒక సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నేతల తిరుగుబాటుతో అధికార వైసీపీలో గుబులు మొదలైందని రఘురామ ఎద్దేవా చేశారు.
సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు గెలుస్తానని మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారని రఘురామ గుర్తు చేశారు. అన్ని సీట్లు సాధించి కేంద్రంతో పార్లమెంటులో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా ప్రకటిస్తామని కొడాలి అన్నారని గుర్తు చేశారు. అయితే, పార్లమెంటు చట్టం చేస్తేనే ఏపీ రాజధాని మార్పు సాధ్యమని కొడాలి గ్రహించారని రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ తో స్నేహం తర్వాతే ఆదానీ కంపెనీ షేర్లు కుప్పకూలిపోయాయని రఘురామ చురకలంటించారు.