ఇచ్చినమ్మ వాయినం అంటే సరిపోతుందా? పుచ్చుకున్న వాయినం అని బదులివ్వాలి కదా? బర్త్ డే కు అభిమానంతో పిలిస్తే వెళ్లినోళ్లకు రిటర్ను గిఫ్టు కూడా ఇస్తారు కదా.
మరి.. పుట్టిన రోజున ఊహించని విధంగా షాకిచ్చి.. తన లాంటి వారినే టచ్ చేసిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిసైడ్ అయిపోయారు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.
తనపై పెట్టిన కేసులు ఒక లెక్క అయితే.. తనను తీసుకెళ్లి కస్టడీలో తనపై చేసిన దాడిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
అందుకే.. తన బుర్రకు పదును పెట్టి.. ఎవరెవరికి ఎలాంటి రిటర్న్ గిఫ్టు ఇవ్వాలన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి మెరుగైన వైద్యం కోసం వెళ్లిన ఆయన.. తొలుత కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావటం.. దాని రియాక్షన్ వచ్చేయటంతో ఆయన తన రిటర్న్ గిఫ్టుల జోరును పెంచారు. లోక్ సభ స్పీకర్ తో భేటీ కావటం.. అనంతరం ఎంపీలకు లేఖలు రాయటం లాంటి పనులు చేస్తున్నారు.
అలా తన అరెస్టు ఎపిసోడ్ లో సంబంధం ఉన్న వారందరికి తన తరఫున అందాల్సినవి అందేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సాక్షి టీవీ చానల్ కు లీగల్ నోటీస్ ఇచ్చారు.
రఘురామ తరఫున న్యాయవాది ఉమేశ్ఈ నోటీసు జారీ చేశారు. తన పరువు.. ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకువ్యతిరేకంగా పలు కథనాలు ప్రసారం చేశారంటూ ఆరోపించారు.
ఈ నోటీసులో సాక్షి టీవీ చానల్ ప్రసారం చేసిన కొన్ని కథనాల్ని ఉదహరించారు. తన నోటీసులకు వారం రోజుల్లో స్పందించాలని.. లేకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఈ నోటీసులు పంపిన వారిలో సాక్షి టీవీ ఛైర్రమన్ వైఎస్ భారతీరెడ్డి.. పాలకవర్గం డైరెక్టర్లు.. ఎడిటర్ ఇన్ చీఫ్ నేమాని భాస్కర్.. కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు నోటీసులు జారీ చేశారు.
రఘురామ పంపిన రిటర్ను గిఫ్టుకు ఎలాంటి సమాధానాలు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.