సొంత పార్టీ మీదనే తరచూ ఘాటు వ్యాఖ్యలు చేసే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు షాకిచ్చింది వైసీపీ. గడిచిన ఏడాదిన్నరగా పార్టీ మీద అదే పనిగా విమర్శలు చేసే ఆయన తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహాం వ్యక్తమవుతోంది.
ఇటీవల దేశ ద్రోహం కేసు నమోదై.. బెయిల్ మీద బయట ఉన్న రఘురామకు షాకిచ్చింది వైసీపీ. ఇప్పటివరకు వైసీపీ వెబ్ సైట్లో నరసాపురం పార్టీ ఎంపీగా రఘురామ పేరు ఉంది. తాజాగా సవరించిన జాబితాలో ఆయన పేరు లేదు.
ఇటీవల జరిగిన తరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో.. వైసీపీ వెబ్ సైట్ లో తమ పార్టీ ఎంపీల జాబితాలో ఆయన పేరును చేర్చారు. అదే సమయంలో.. రఘురామకృష్ణరాజు పేరును తొలగించారు. అయితే.. దీనిపై ఎవరూ మాట్లాడలేదు.
వైసీపీ వెబ్ సైట్ లోని ఎంపీ జాబితాలో తన పేరు లేకపోవటాన్ని రఘురామ ప్రస్తావించారు. ‘ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా?’’ అని ప్రశ్నించారు. తనపై అనర్హత వేటు వేసి.. ఎంపీ పదవి నుంచి తప్పించాలంటూ జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కావన్నారు.
ఇప్పటికే తమ పార్టీకి చెందిన వారు నాలుగైదు సార్లు తనపై అనర్హత వేటు వేయాలని కోరారని.. తాజాగా మరోసారి కంప్లైంట్ ఇచ్చారన్నారు. దీని వల్ల ఏమీ కాదన్న ధీమాను వ్యక్తం చేయటం గమనార్హం.
పార్టీ మీదా.. పార్టీ అధినేత మీద అదే పనిగా వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారిన రఘురామ మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోవటం.. పార్టీ వెబ్ సైట్ నుంచి పేరు తొలగించటం మంచి పరిణామంగా అభివర్ణిస్తున్నారు. రానున్న కాలంలో మరేం జరుగుతుందో చూడాలి.