గురువుకు మించిన శిష్యుడన్న సామెతకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇట్టే సరిపోతారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్ సాఫ్ట్ వేర్ ను క్రాక్ చేయటం.. ఆయన ఆలోచనల్ని చదివినట్లుగా ఎదురుదాడి చేసే విషయంలో తెలుగు తమ్ముళ్లు తేలిపోవటమే కాదు.. అర్జెంట్ గా వారందరికి కొత్త తరహా రాజకీయ పాఠాల్ని నేర్పించాల్సిన అవసరం ఏర్పడిందన్న భావన కలిగేది. అప్పటివరకు జగన్ దాసుడిగా ఉంటూ.. ఒక్కసారిగా చెలరేగిపోయిన రఘురామకృష్ణంరాజు పుణ్యమా అని.. జగన్ అండ్ కోను చికాకు పెట్టే తరీఖా ఏమిటో అందరికి తెలిసేలా చేసిన క్రెడిట్ ను సొంతం చేసుకున్నారు.
ఎంతకూ కొరుకుడుపడని జగన్ ను ఇట్టే ఇరిటేట్ చేసే విధానం ఏమిటో పొలిటికల్ ఆర్ఆర్ఆర్ దెబ్బకు అందరికీ అర్థమైన పరిస్థితి. అదెంతవరకు వెళ్లిందంటే.. ఇప్పటివరకు దేశ చరిత్రలో మరే అధికార పార్టీకి చెందిన ఎంపీకి దక్కని అనుభవాన్ని రఘురామకృష్ణంరాజు చవి చూశారని చెప్పాలి.
ఎంత కోపం ఉంటే మాత్రం ఒక ఎంపీ తనను పోలీసులు అదుపులోకి తీసుకొని చితక్కొట్టారంటూ.. లాకప్ లో సినిమా చూపించారని చెప్పుకోవటం కనిపించదు. ఆయన మాటల్లో నిజానిజాలు ఆయనిచ్చిన ఫిర్యాదు మీద విచారణ పూర్తై.. అధికారిక నివేదికలో వెల్లడి కావాల్సి ఉంది.
మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద చిన్నపాటి యుద్దాన్నే చేసిన ఆర్ఆర్ఆర్.. ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తాజాగా ఒక లేఖ రాశారు. తనపై దాడి జరిగిన ఘటనను ప్రస్తావించిన ఆయన.. దీనిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు ఒక లేఖ రాశారు.
అయినా.. డీజీపీగా బాధ్యతలు చేపట్టి పట్టుమని పది రోజులు కాదు కదా.. రెండు రోజులే అయ్యింది. అప్పుడే లేఖల్ని సంధించటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇక.. లేఖ విషయానికి వస్తే.. తన కేసు విషయంలో నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరారు.
తనపై జరిగిన సీఐడీ దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని పేర్కొంటూ.. తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారన్నారు. దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారన్న ఆయన.. ఈ ఘటనపై నివేదిక కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఆదేశాలు జారీ చేసినా గౌతమ్ సవాంగ్ స్పందించలేదన్నారు.
లోక్ సభ స్పీకర్ కు త్వరగా నివేదిక పంపాలన్న ఆయన.. పోలీసు వ్యవస్థపైన విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరి.. రఘురామ రాసిన లేఖకు ఇటీవలే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.