కొద్ది నెలల క్రితం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై కస్టడీలో లాఠీచార్జి జరిగిందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందు .ఏపీ ప్రభుత్వంపై రాజ ద్రోహానికి పాల్పడ్డారు అన్న ఆరోపణలతో రఘురామపై కేసు నమోదు చేసిన ఏపీ సిఐడి పోలీసులు కస్టడీలో ఆయనను టార్చర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అయితే, తాజాగా విశాఖపట్నం పర్యటన సందర్భంగా జగన్ పై, వైసీపీ ప్రభుత్వం పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపద్యంలోనే తాజాగా జగన్ ను ఉద్దేశించి రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, జెపి నడ్డాల విషయంలో జగన్ స్టాండ్ ఏమిటని ప్రశ్నించారు. తనలాగే వీరిని కూడా కొడతారా అని రఘురామ ప్రశ్నించారు. ఎటువంటి దాపరికం లేకుండా మిస్సైల్ తరహాలో జగన్ ప్రభుత్వంపై షా, నడ్డాలు సూటిగా దాడి చేశారని రఘురామ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని షా అన్నారని రఘురామ గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను కుట్ర చేస్తున్నానంటూ రావి ద్రోహం కేసు పెట్టారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, జగనన్న విద్యా దీవెన సభలో రాజకీయాల ప్రస్థావన ఎందుకు వచ్చిందని అన్నారు. విద్యా వ్యవస్థకు జగన్ చేస్తున్న మేలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ బయోపిక్ తో సినిమా చేస్తున్నారని, ఆ సినిమాను జనం ఎవరూ చూడరని ఎద్దేవా చేశారు. పవన్ తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని రఘురామ ఆకాంక్షించారు.