రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, 2019 ఎన్నికల ఫలితాలలో వచ్చిన 151 సీట్లకు మించి ఈ సారి ఎన్నికల్లో సీట్లు వస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ఓటమి ఖాయమని, కూటమి 130కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కూటమి నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన రఘురామ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో భేటీ సందర్భంగా పోలింగ్ సరళి, ఫలితాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై వైసీపీ మాజీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగానే జగన్ కు షాక్ తప్పదని, జగన్ ఆశలు ఆవిరవుతాయని అన్నారు. వైసీపీకి కనీసం 25 అసెంబ్లీ స్థానాలు కూడా రావని రఘురామ ఎద్దేవా చేశారు.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే పల్నాడు, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాల్లో హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. సజ్జలతో పాటు వైసీపీ నేతల కళ్లలో భయం కనపడుతోందని, కళ్లు అబద్ధం చెప్పవని విమర్శించారు. కూటమికి 130 సీట్లు వస్తాయని గతంలోనే చెప్పానని, పోలింగ్ తర్వాత ఆ సంఖ్య 150 దాటినా ఆశ్చర్యపోనని అన్నారు. 2019లొ 110 వస్తాయని జగన్ అనుకుంటే 151 వచ్చాయని, జగన్ కూడా ఊహించలేక పోయారని చెప్పారు.
అదే విధంగా ఈ సారి ఎన్నికల్లో ఓటమిని కూడా జగన్ ఊహించలేదని చురకలంటించారు. ఉద్యోగుల ఓటింగ్ 85 శాతం పడిందని, అన్ని వర్గాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని రఘురామ అన్నారు. పులివెందులే టైట్ గా ఉందని, మిగతా చోట్ల గురించి చెప్పనవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు.
కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు మరోసారి సీఎం కావాలని తిరుమల వెంకన్నకు మొక్కుకున్నానని రఘురామ చెప్పారు.ప్రశాంత్ కిశోర్ ఊహించనన్న సీట్లు వైసీపీకి వస్తాయని ఐ ప్యాక్ సభ్యులతో జగన్ చేసిన కామెంట్ల నేపథ్యంలోనే రఘురాజు కౌంటర్ ఇచ్చారు.