సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యపరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ నాగార్జునను జ్యుడీషియల్ అధికారిగా తెలంగాణ హైకోర్టు నియమించింది. ఆయన నేతృత్వంలోని ముగ్గురు ఆర్మీ వైద్యుల మెడికల్ బోర్డు రఘురామకు నేడు ఉదయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ స్పెషల్ రూమ్లో రఘురామకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రఘురామ కుడి కాలుకు తీవ్రమైన వాపు ఉంది. దీంతో నొప్పి, వాపు, ఇంటర్నల్ పెయిన్స్ తగ్గించేందుకు చికిత్స చేస్తున్నారు. చికిత్స ప్రక్రియను ఆర్మీ సిబ్బంది వీడియోగ్రఫీ చేస్తోంది. మరోవైపు, రఘురామ స్టేట్మెంట్ మొత్తాన్ని అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
మరోవైపు, ఆర్మీ ఆసుపత్రి వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, సైనికాధికారులు మీడియాను లోపలికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలోనే తన తండ్రిని చూసేందుకు వచ్చిన రఘురామ కుమారుడు భరత్ ను ఆర్మీ అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో, ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీ ఆసుపత్రి నుండి భరత్ వెనుదిరిగారు.
తాము తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు రఘురామను ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంచాలని సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నెల 21 వరకు ఆర్మీ ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు జరుగనున్నాయి. ఈ నెల 21న రఘురామ మెడికల్ రిపోర్ట్, వీడియోగ్రఫి, స్టేట్మెంట్ను అధికారులు సీల్డ్ కవర్లో ఉంచి సుప్రీం కోర్టుకు అందజేయనున్నారు. దీంతో, ఆర్మీ ఆసుపత్రి ఇచ్చే మెడికల్ రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.