భీమవరంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో వైైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, వైసీపీ నేతలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారాన్ని పవన్ ప్రస్తావించారు. సొంతపార్టీలోని సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ అన్న ఆలోచన కూడా లేకుండా పోలీసులతో లాక్కొచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని పవన్ ఆరోపించారు.
అరికాళ్లపై కొట్టించి, నడవలేకుండా చేశారని, సొంత నియోజకవర్గంలోకి కూడా రాలేని పరిస్థితులు కల్పించారని అన్నారు. అది రఘురామపై దాడి కాదని, క్షత్రియులందరిపై వైసీపీ చేసిన దాడి అని పవన్ అన్నారు. “అదే మీ పులివెందులలో ఈ విధంగా చేస్తే మీరు ఒప్పుకుంటారా? దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనం కులాలుగా విడిపోయాం. రఘురామకృష్ణరాజు నా కులం కాదు. కానీ, నా సాటి మనిషి. ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి ఆయన. ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే అందుకు బదులివ్వడం అనేది ఉంటుంది. కానీ అందుకు ఓ పరిమితి ఉంటుంది” అంటూ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కామెంట్లపై రఘురామ స్పందించారు. తనకు బాసటగా నిలిచినందుకు పవన్ కు రఘురామ కృతజ్ఞతలు తెలిపారు. సీఐడీ పోలీసులు తనపై చేసిన క్రూరమైన దాడిని ఖండించినందుకు పవన్ కు రఘురామ ధన్యవాదాలు తెలిపారు. పవన్ వ్యాఖ్యల వీడియోను కూడా షేర్ చేస్తూ రఘురామ ట్వీట్ చేశారు.‘‘సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు మీకు ఆహ్వానం ఉన్నప్పటికీ, నా సొంత నియోజకవర్గానికి, విగ్రహావిష్కరణకు నన్ను రాష్ట్ర ప్రభుత్వం రానివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా అంత గొప్ప కార్యక్రమానికి మీరు హాజరుకాకపోవడం మీలాంటి ధైర్యమున్న నాయకులకు మాత్రమే సాధ్యం. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అని రఘురామ ట్వీట్ చేశారు.
Comments 1