తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. సభా వేదికపై చంద్రబాబును రఘురామ మర్యాదపూర్వకంగా పలకరించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఘటన వైరల్ అయింది. అంతకుముందు, రేణిగుంట విమానాశ్రయంలో రఘురామకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు.
ఏపీకి రాజధాని లేని పరిస్థితిని కల్పించారని రఘురామ మండిపడ్డారు. ఇది రాజకీయ సభ కాదని, దగాపడ్డ రైతుల సభ అని రఘురామ చెప్పారు. రైతులకు మద్దతుగా అన్ని వర్గాలువస్తున్నాయని, వంద శాతం అమరావతే రాజధాని అని అన్నారు. అమరావతే శాశ్వతమని, అడ్డుపడే మేఘాలు అశాశ్వతమని తెలిపారు. బొత్స సత్యనారాయణ మంచివాడని తాను చెప్పనని, కానీ, చెడ్డవాడు మాత్రం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరో చెప్పినట్లుగా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు.
రాజధాని కోసం అమరావతి రైతుల త్యాగం మరువలేనిదని, రాజధాని రైతులు ధైర్యంగా పోరాడాలని, అంతిమ విజయం వారిదేనని అన్నారు. ఢిల్లీ నుంచి రఘురామతో పాటు అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభకు నటుడు శివాజి, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ, శ్రీనివాసానంద సరస్వతి స్వామి (గుంటూరు), కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు.
ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జాతీయవ్యాప్తంగా విపరీతమైన స్పందన వచ్చింది. తనను ఇరుకున్న పెడుతున్న చంద్రబాబు, రఘురామలు ఒకే వేదికపై ఆలింగనం చేసుకోవడం జగన్ కు షాకిచ్చినట్లయిందని అనుకుంటున్నారు. తిరుపతి సభలో ఆ సీన్ చూశాక జగన్ కు నిద్రపట్టదేమో అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.