వైసీపీ అధినేత, ఏప సీఎం జగన్ తో పాటు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా ముప్పుతిప్పలు పెడుతోన్న సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ వేసిన పిటిషన్…దాదాపు తీర్పు దశకు చేరుకుంది. ఈ నెల 25న జగన్ కు జైలా? బెయిలా? డిసైడ్ అవుతుందని ప్రచారం జరుగుతుండడంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే వైసీపీ నేతలకు ఆర్ఆర్ఆర్ మరో షాకిచ్చారు.
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని నాంపల్లి సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ హోదాలో సాయిరెడ్డి…కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలుస్తుంటారని, ఈ క్రమంలోనే తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా సాక్షులకు భయం కలిగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు ప్రధాన దర్యాప్తు అధికారిని సీబీఐ జేడీగా నియమించవద్దని విజయసాయి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు. అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని సాయిరెడ్డి వ్యాఖ్యానించడం కూడా కోర్టు ధిక్కరణేనని పేర్కొన్నారు.
కాగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. ఏపీలో ఎన్జీఆర్‌వో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని, నిధులు కేంద్రం మంజూరు చేసినా… ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గత రెండేళ్లుగా చెల్లించడం లేదని తెలిపారు. ఎన్జీఆర్వోఎస్ నిధులను కేంద్రమే నేరుగా లబ్ధిదారులకు చెల్లించాలని లేఖలో రఘురామకృష్ణరాజు కోరారు.