టీటీడీ చైర్మన్ గా తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి నియమించడంపై కొంతకాలంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. దానికితోడు టీటీడీ ఆస్తులు, ఆదాయాల వ్యవహారంలోనూ వైవీ వైఖరిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సభ్యుల నియామకాల్లోనూ జగన్ అనుయాయులకు పెద్దపీట వేశారని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు…ఆ నియామకాలకు సంబంధించిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని, ఈ కేసు రాబోయే రోజుల్లో కొట్టివేయబడుతుందనే దాంట్లో అనుమానం లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల వెనుక ఎటువంటి కుట్రలు లేవని, భక్తుల మనోభావాలను కాపాడడం కోసమే కేసు వేశారని అన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కి తగిన నిధులు లేవని, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో ఎవరిని నియమించకపోవడం గర్హనీయమని రఘురామ వ్యాఖ్యానించారు. వ్యాపారాలు చేసుకునే వారిని టీటీడీలో నియమిస్తున్నారని విమర్శించారు.
భగవంతుడి సేవలో మంచివారిని నియమించాలని రఘురామ హితవు పలికారు. టీటీడీ జాయింట్ ఈవో పోస్ట్ రాజ్యాంగ ప్రకారం ఉందని, కానీ.. అదనపు ఈవో పోస్టు లేదని రఘురామ అన్నారు. ముఖ్యమంత్రి ఏ విధంగా టీటీడీ అదనపు ఈవోను నియమిస్తారని రఘురామ ప్రశ్నించారు. టీటీడీలో ఎన్నో లొసుగులున్నాయని, ఏ అపచారం జరిగినా స్వదేశీ సేన తరపున ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని రఘురామ స్పష్టం చేశారు. మరి, రఘురామ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.