కొద్ది రోజులుగా ఏపీలో వివిధ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీడీపీతో జనసేన పొత్తు ఖాయమని, అవసరమైతే బీజేపీ కూడా ఆ రెండు పార్టీలకు మద్దతిస్తుందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు పొడవబోతోందని, ఆ విషయాన్ని పీకే స్వయంగా వెల్లడించారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య పొత్తులుంటాయని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం రాక్షస వధ జరగాలని, దీనికోసం రాజకీయాల్లో కొంతమంది కలయికలుంటాయని రఘురామ అన్నారు. జగన్, ఆయన అనుచరులు ఎంత కవ్వించినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బెదరరని తేల్చి చెప్పారు. నిజం చెప్పే పత్రికలు జగన్ దృష్టిలో విషపత్రికలని రఘురామ ఎద్దేవా చేశారు. భయంతో వివిధ సభల్లో ఓ వర్గం మీడియాపై జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
‘గడపగడప’కు వస్తున్న తీవ్ర ప్రతిస్పందనను బట్టి ప్రభుత్వాన్ని సాగనంపాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చినట్లున్నారని అన్నారు.సొంత పార్టీ పెట్టే ఆలోచన లేదని, అలెయిన్స్‌లో ఉండే పార్టీలో ఉంటానని చెప్పారు. అలెయిన్స్‌లో రెండు లేదా మూడు పార్టీలు ఉండవచ్చని జనసేన, టీడీపీ, బీజేపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు వైసీపీలో ఇక టికెట్ ఇవ్వరని చెప్పారు. భవిష్యత్తులో ఏపీలో జీతాలిచ్చే పరిస్థితి ఉండదని, నిబంధనలు విరుద్ధంగా వివిధ బ్యాంకులు లోన్ ఇస్తున్న విషయాన్ని బ్యాకింగ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అవసరం కేంద్రానికి లేదని, జులైనాటికి వైసీపీ ఖేల్ ఖతం అని జోస్యం చెప్పారు. గతంలో చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ప్రస్తుత సీఎం విమర్శించే వారని, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజ్ఞాన, వినోద యాత్ర అని రఘురామ ఎద్దేవా చేశారు.