ఉక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేస్తోన్న సంగతి తెలిసిందే. యూరప్ లోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడించిన ఉక్రెయిన్ లోని జపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ పై రష్యా దాడులకు దిగడంతో యూరప్ దేశాలు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ అణు విద్యుత్ ప్లాంట్ ధ్వంసమైతే వెలువడే రేడియేషన్ తో యూరప్ అతలాకుతలమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ ను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)కి ఉక్రెయిన్ తీసుకువెళ్లింది.
జపోర్జియా అణు విద్యుత్ కేంద్రంలో 6 అత్యంత శక్తిమంతమైన రియాక్టర్లు ఉన్నాయి. అయితే, అణు విద్యుత్ కేంద్రం నుంచి ఎంత రేడియేషన్ విడుదల అవుతోంది అన్న విషయంపై తీవ్ర ఆందోళనలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ప్లాంట్ లోని రేడియేషన్ విడుదల పరిస్థితిపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియో గ్రాస్సీ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్లాంట్ సాధారణ సిబ్బందితో యథావిధిగా నడుస్తోందని వెల్లడించారు. రేడియాధార్మిక పదార్థాల విడుదలపై ఎటువంటి ఆనవాళ్లు లేవని క్లారిటీ ఇచ్చారు.
రష్యా దాడుల నేపథ్యంలో గతరాత్రి అణు విద్యుత్ ప్లాంట్ లోని ఓ శిక్షణ కేంద్రాన్ని ఓ మిస్సైల్ తాకిందని, దాంతో అగ్నిప్రమాదం సంభవించిందని వెల్లడించారు. ఆ మంటలను సిబ్బంది వెంటనే ఆర్పివేశారని ఐఏఈఏకి సమాచారం అందిందని చెప్పారు. ఆ దాడి వల్ల ప్లాంట్ లోని భద్రతా వ్యవస్థలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, రేడియేషన్ గుర్తించే వ్యవస్థలు సజావుగానే పనిచేస్తున్నాయని అన్నారు.
మరోవైపు, ఉక్రెయిన్ పై రష్యా దాడులతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. అణు రియాక్టర్ పై దాడితో ప్రపంచవ్యాప్తంగా కమాడిటీస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ముడి చమురు, అల్యూమినియం, గోధుమల వంటి వాటి రేట్లు పెరిగాయి. 1974 నుంచి ఇదే అత్యధిక పెరుగుదల అని నిపుణులు అంటున్నారు.