ఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రాధాకిషన్ రావు ఇటీవల అరెస్టు కావటం తెలిసిందే. తాజాగా ఆయనపై కిడ్నాప్ కేసు నమోదైంది. పోలీసు శాఖలో ఒక వెలుగు వెలిగిన ఆయన.. ట్యాపింగ్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి ఈ కేసులో కీలకంగా మారిన రాధాకిషన్ రావు లీలు.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆయనకు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్న కొద్దీ.. ‘‘సారు.. మరీ ఇంత ముదురుకేసా’’ అన్నది డిపార్టుమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకీలకంగా మారటమే కాదు.. దాన్నో ఆయుధంగా మార్చుకొని అమాయకులు.. రాజకీయాలతో సంబంధం లేని వ్యాపారులు.. ప్రముఖులు.. సెలబ్రిటీలతో సాగించిన దందాలు ఎంతన్నది ఒక్కొక్కటిగా బయటకు వస్తూ విస్మయానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాల్ని చూస్తే.. రాధాకిషన్ రావు ఇదంతా చేశారా? అన్నదిప్పుడు సంచలన చర్చగా మారింది.
దాదాపు ఐదారేళ్ల క్రితం జరిగినట్లుగా చెబుతున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఒక కంపెనీ యజమానికి సంబంధించిన వ్యాపార వివాదంలో తలదూర్చటమే కాదు.. అతన్ని కిడ్నాప్ చేయటం.. షేర్లు బదిలీతోపాటు భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకున్న వైనం చూస్తే.. వామ్మో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఈ కేసులోనూ రాధాకిషన్ కు రైట్ హ్యాండ్ గా వ్యవహరించే ఇన్ స్పెక్టర్లు గట్టుమల్లు.. మల్లికార్జున్ లు కూడా నిందితులుగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్ కు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ కొంతకాలం ప్రపంచ బ్యాంకులో పని చేసి 2008లో తిరిగి వచ్చేశారు. 2011లో క్రియా హెల్త్ కేర్ సంస్థను ప్రారంభించారు. 2014 నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 165 పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు.. టెలి మెడిసిన్ సౌకర్యాలతో పాటు.. అత్యవసర వాహనాలతో ప్రధాన ప్రాజెక్టులను దక్కించుకునేది. 2016నాటికి క్రియా హెల్త్ కేర్ మూడు ప్రధాన ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. దీంతో ఐదేళ్లలో తమ ప్రాజెక్టు విలువను రూ.250కోట్లకు పెంచుకుంది.
ఇదిలా ఉండగా 2015లో ఈ సంస్థలో కొందరు పార్ట్ టైం డైరెక్టులుగా చేరారు. అదే సమయంలో బాలాజీ అనే వ్యక్తి సంస్థకు సీఈవోగా నియమితులయ్యారు. 2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి క్రియా హెల్త్ కేర్ లో ఆరుగురు ైరెక్టర్లు ఉండేవారు. వీరిలో వేణుకు 60 శాతం.. బాలాజీకి 20 శాతం.. గోపాల్, రాజ్ లకు చెరో పది శాతం చొప్పున షేర్ ఉండేది. వీరిలో వేణు.. బాలాజీ మాత్రమే ఫుల్ టైం డైరెక్టర్లు. 2018లో యూపీ ప్రభుత్వం నాన్ ఎమర్జెన్సీ మొబైల్ హెల్త్ కేర్ క్లినిక్ లకు బిడ్డింగ్ ను ఆహ్వానించింది. అందులో పాల్గొన్న క్రియా హెల్త్ కేర్ 1500 మొబైల్ అంబులెన్సులు.. హెల్త్ క్లినిక్ లను నడిపే ప్రాజెక్టు తీసుకునే అవకాశం లభించింది.
ఈ సమయంలో వేణు వద్ద ఉన్న 60 శాతం షేర్లను తక్కువ ధరకు అమ్మాలంటూ ఒత్తిడి చేయటం షురూ చేశారు. ఇందులో భాగంగా కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్న బాలాజీని తమకు తగ్గట్లుగా మార్చుకున్నారు. ఇదే సమయంలో రాధాకిషన్ రావు ఎంట్రీ ఇచ్చి.. తన ఇన్ స్పెక్టర్లు గట్టుమల్లు చేత వేణుకు బెదిరింపులు ఇప్పించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన క్రియా హెల్త్ కేర్ కంపెనీలో ఉన్న షేర్లు.. యజామాన్య హక్కుల్ని వదులుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. రాధాకిషన్ రావు సమక్షంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా బాధితుడు వేణు తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పట్లో తనను గన్స్.. కర్రలతో బెదిరిస్తూ సంతకం చేయటం తప్పించి మరింకేమీ చేయలేని పరిస్థితుల్ని క్రియేట్ చేసి.. సెటిల్ మెంట్ అగ్రిమెంట్ మీద సంతకం చేయించారట. అంతేకాదు వేణు నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు కానీ మీడియాకు కానీ, కోర్టులను ఆశ్రయించినా ప్రాణహాని తప్పదని బెదిరింపులకు దిగారు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా ఉన్న ఆయన.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బయటకు వచ్చి జరిగిన అంశంపై ఫిర్యాదు చేశారు. దీనిపై రాధాకిషన్ రావు అండ్ కో మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అంశంపై విచారణ జరగటం ద్వారా మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.
Phone Taping Latest Updates : ఇవాళ కోర్ట్ ముందుకు రాధాకిషన్ రావు | ABN Telugu #phonetapingcase #radhakishanrao #latestupdates #abntelugu pic.twitter.com/pEdKlj5yq2
— ABN Telugu (@abntelugutv) April 10, 2024