ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, కొంతమంది వైద్య సిబ్బంది, నర్సుల నిర్లక్యం వల్ల ఒకరికే రెండు డోసుల వ్యాక్సిన్ ఒకేసారి వేయడం, ఒకసారి కోవ్యాక్సిన్, మరోసారి కోవిషీల్డ్ వేయడం వంటి పొరపాట్లు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఏమరపాటో..పొరపాటునే ఏదో ఒకటి అనుకున్నా…అక్కడ జనాలకు కరోనా వ్యాక్సిన్ మాత్రమే వేశారు.
అయితే, అందుకు భిన్నంగా తెలంగాణలో తాజాగా ఓ మహిళకు కరోనా వ్యాక్సిన్ కు బదులు కుక్క కాటుకు వేసే రేబిస్ వ్యాక్సిన్ వేసిన ఘటన కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కట్టంగూరు పీహెచ్సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. అయితే, ఈ విషయం గురించి తెలియని ప్రమీల నేరుగా పీహెచ్ సీ భవనంలోకి వెళ్లారు.
అయితే, పీహెచ్ సీలో ఓ మహిళకు అక్కడి నర్సు యాంటి రేబిస్ వ్యాక్సిన్ను వేసింది. అదే సమయంలో లోపలికి వెళ్లిన ప్రమీలకు కూడా అదే వ్యాక్సిన్ వేసింది. ప్రమీలకు కొవిడ్ టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను కూడా ఆ నర్సు చదవకుండా నిర్లక్షం వహించింది. అంతేకాదు, కనీసం సిరంజి కూడా మార్చకుండా…తనకూ అదే సిరంజీతో యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని ప్రమీల ఆరోపించారు.
ఈ విషయంపై గొడవ కావడంతో నర్సు అక్కడ నుంచి జారుకుంది. అయితే, ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదని, టీటీ ఇంజక్షన్ ఇచ్చామని వైద్యాధికారి చెప్పడం కొసమెరుపు. ఇంత నిర్లక్ష్యంగా టీకాలు, ఇంజెక్షన్లు వేస్తున్న వైద్య సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.