ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ప్రమాదకర ధోరణిలో సాగుతున్నాయి. రాష్ట్రాభివృద్ధిని, ప్రజా ప్రయోజనాలను విస్మరించి, కేంద్రంలోని మతోన్మాద బి.జె.పి ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీ పడుతున్నాయి.
అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా బి.జె.పి పంచన చేరడంలో వీటి మధ్య తేడా ఏమీ లేదు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా చీలిపోవడమే బాధాకరమనుకుంటే, నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడి గడిచిన ఆరేళ్ళలో అధికార ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధిని విస్మరించి వ్యవహరించడం క్షమించరాని నేరం.
2014లో రాష్ట్ర విభజన సందర్భంలో కొత్త రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ ఇస్తామని కేంద్రం చెప్పింది. తాము కేంద్రంలో అధికారానికి వస్తే పది సంవత్సరాలు ‘ప్రత్యేక హోదా’ కొనసాగిస్తామని ఆనాడు బిజెపి ప్రకటించింది. తర్వాత అధికారానికి వచ్చిన బిజెపి మోడీ నాయకత్వాన ఆరు సంవత్సరాల నుండి పరిపాలిస్తూ వాగ్దాన భంగంజేసి రాష్ట్రానికి ద్రోహం చేసింది.
ఆనాడు పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలో అనేక వాగ్దానాలు చేయబడ్డాయి. రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగినన్ని నిధులిస్తామని, కడప స్టీలుప్లాంటు, కాకినాడ నూనెశుద్ధి కర్మాగారం, దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం, విశాఖ రైల్వేజోను ఏర్పాటు వంటి అనేక వాగ్దానాలివ్వబడ్డాయి. కేంద్రం కొన్ని వాగ్దానాల నుండి వెనక్కి పోయింది, మరి కొన్నింటికి అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకుంది.
బి.జె.పి కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలను, విభజన చట్ట నిర్ణయాలను కాలరాస్తుంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మిన్నకున్నాయి. అస్త్ర సన్యాసం చేసి, బి.జె.పి ప్రాపు కోసం పాకులాడుతున్నాయి. కొత్త రాష్ట్రంలో మొదటి ఎన్నికల్లో గెల్చి తెలుగుదేశం అధికారానికి వచ్చింది. కేంద్రంలో బి.జె.పి తో అధికారం పంచుకుంది. రాష్ట్రంలో బి.జె.పికి మంత్రివర్గంలో చోటిచ్చింది. ఆ రకంగా బి.జె.పితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు పూనుకోలేదు.
బి.జె.పి ద్రోహాన్ని వెనకేసుకొచ్చి నాలుగు సంవత్సరాలపాటు ప్రజలను మభ్య పెట్టేందుకు పూనుకున్నది. ప్రజాగ్రహానికి గురవుతామని భయపడి ఎన్నికల ముందు బిజెపితో తెగతెంపులు చేసుకున్నప్పటికీ 2019 ఎన్నికల అనంతరం, మళ్ళీ ప్లేటు మార్చి బిజెపికి అనుకూలంగా మారింది. అన్ని సందర్భాలలోనూ సంపూర్ణంగా మద్దతిస్తున్నది. కొత్తగా ఇప్పడు బిజెపి మత రాజకీయాల రంగును పులుముకునే ప్రయత్నం చేస్తున్నది.
ఆనాడు ప్రతిపక్షంలో వున్న వైఎస్ఆర్ పార్టీ మాట వరసకు స్పెషల్ స్టేటస్ కావాల్సిందే అని ప్రకటనలు చేసినా, కేంద్ర బిజెపి మీద ఈగ వాలనివ్వకుండా వ్యవహరించింది. బిజెపి ద్రోహాన్ని ప్రశ్నించడానికి పూనుకోలేదు. పార్లమెంటులో అన్ని కీలక సందర్భాలలో బిజెపికి మద్దతుగా నిలబడింది. విచిత్రమేమంటే బిజెపి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా వున్నా వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేకపోయింది.
బిజెపి పట్ల వైఎస్ఆర్ పార్టీకి వున్న భయం లేదా భక్తి, తెలుగుదేశం భాగస్వామ్య ప్రభుత్వాన్ని సమర్థించే స్థితికి ఆ పార్టీని దిగజార్చింది. 2014 ఎన్నికల ముందు ప్రారంభమైన జనసేన…బిజెపి, తెలుగుదేశం సేవతో మొదలుపెట్టి మధ్యలో స్పెషల్ స్టేటస్ కోసం వామపక్షాలతో కలుస్తున్నామని చెప్పి…2019 ఎన్నికల అనంతరం గురువుని మించిన శిష్యుడి లాగా బిజెపి మత రాజకీయాలను భుజాన వేసుకుని తిరుగుతోంది.
రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇస్తానన్న నిధులను రాబట్టుకొని నూతన రాష్ట్రానికి నూతన రాజధానిని సత్వరం పూర్తిచేసుకుందామన్న ధ్యాస అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఏ కోశానా కనబడలేదు. కేంద్రంలో భాగస్వామిగా వుండి కూడా అనాడు తెలుగుదేశం అవసరమైన నిధులు రాబట్టలేదు. అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తెలుగుదేశం పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్‌గా మార్చింది.
రాష్ట్ర రాజధానికి అవసరమైన సౌకర్యాల నిర్మాణంపై కేంద్రీకరించి తొందరగా పూర్తిచేయకుండా అసాధ్యమైన, ఊహాజనితమైన ప్రణాళికలను ప్రకటలను చేస్తూ కాలక్షేపం చేసింది. సిపిఐ(ఎం), వామపక్షాలు ఆనాడు చెప్పిన విధంగా నాలుగయిదు వేల ఎకరాల స్థలంలో ప్రభుత్వ పాలనా కేంద్రం నడవడానికి అవసరమైన సౌకర్యాల నిర్మాణంపై దృష్టి పెట్టివుంటే ఈపాటికి రాజధాని పూర్తయి వుండేది. వేలాది మంది రైతు, కూలీలు రోడ్డున పడేవారు కాదు. రియల్ ఎస్టేట్ కుంభకోణాలకు అవకాశం వుండేది కాదు. వైఎస్ఆర్ పార్టీ నేడు ముందుకు తెచ్చిన ‘మూడు ముక్కల’ సిద్ధాంతానికి అవకాశం ఉండేది కాదు.
అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో వున్నప్పుడు అంగీకరించి ఎన్నికల్లో ప్రజల ముందు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్లేటు మార్చి రాష్ట్ర రాజధానిని వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరించాలన్న వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. కొత్త రాష్ట్రాభివృద్ధికి పూర్తి స్థాయి రాజధాని సత్వరం ఏర్పడడం, అందరికి అందుబాటులో వుండే కేంద్రంలో రాజధాని వుండడం అవసరం అన్న అంశం అధికార పార్టీకి పట్టలేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ తమ చవకబారు రాజకీయాలతో ఆరేళ్ళయినా రాజధాని ఏర్పడకపోవడం పట్ల ఏ చింతా కనపరచడం లేదు. తగినన్ని నిధులు సమకూర్చకుండా కేంద్ర బిజెపి కాలయాపన చేయడాన్ని విస్మరించి ఈ రెండు పార్టీలు తంపులు పడుతున్నాయి.
రాష్ట్రంలో వ్యక్తిగత నిందలు, దూషణలతో, స్వల్ప విషయాలపై కోట్లాడుకోవడంలో తలమునకలవుతున్న అధికార వైఎస్ఆర్సి పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు, మతతత్వ కేంద్ర బిజెపి, దుష్పరిపాలనను భుజాన మోసుకు తిరగడానికి ఒకే మార్గంలో పోవడానికి పోటీ పడుతున్నాయి.
కేంద్రం కార్మిక హక్కులు కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లు తీసుకు వచ్చింది. వీటిని రెండు పార్టీలూ సమర్థించాయి. రైతాంగం, ముఖ్యంగా పేద మధ్య తరగతి రైతాంగాన్ని దెబ్బ తీసే రైతాంగ చట్టాలకు రెండు పార్టీలు కళ్లు మూసుకుని మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రవేటు సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలను రెండు పార్టీలూ ఆలింగనం చేసుకున్నాయి. స్టీల్ ప్లాంటు, రక్షణ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్సు, రైల్వే వంటివి ప్రైవేటు పరం కావడానికి రెండూ తలాడించాయి. ఈ చర్యలు దేశ స్వావలంబనకు, బలహీన వర్గాల రిజర్వేషన్లకు చావు దెబ్బ కొట్టబోతున్నా వీటికి పట్టలేదు. గిరిజనుల, అటవీ హక్కులను కాలరాసే కొత్త పర్యావరణ అంచనా విధానాన్ని అంగీకరించాయి. బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే నూతన విధానాన్ని ఆహ్వానించాయి.
రాష్ట్రంలోని 25 లక్షల మంది బోర్వెల్ రైతులు పొందుతున్న ఉచిత విద్యుత్‌కు, సామాన్య వినియోగదార్లు అనుభవిస్తున్న క్రాస్ సబ్సిడీ పద్ధతికి మంగళం పాడే కొత్త విద్యుత్ చట్టాన్ని సమర్థించాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోవడం అటుంచి, దేశంలో అందరికంటే ముందుగా మీటర్లు బిగించడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పూనుకోవడం బిజెపిని సంతృప్తి పరచడానికి ఎంత దూరమైనా వెళ్తుందని స్పష్టం జేస్తున్నది.
కరోనా విపత్తును ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైనా, ఆర్థిక మాంద్యంలో సామాన్యుల జీవితం చిన్నాభిన్నమైనా, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జిఎస్టి బకాయిలు చెల్లించకపోయినా, 370వ అధికరణాన్ని రద్దు చేసి, పౌరసత్వ చట్టానికి సవరణలను తెచ్చి మైనార్టీలపై లౌకిక విలువలపై దాడి చేస్తున్నా అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపడం లేదు. బిజెపి పాలనలో దళితులు, మహిళలు, మైనారిటీలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నా మత వైషమ్యాలు రెచ్చగొట్టే యత్నాలు జరుగుతున్నా ప్రజాస్వామ్య హక్కులకు భంగం వాటిల్లుతున్నా వీటికి పట్టలేదు.
అధికారాన్ని చేపట్టిన తర్వాతనైనా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడంలేదు. రాష్ట్రాల అధికారాలను కాలరాస్తుంటే ప్రశ్నిస్తున్న ఇతర ప్రభుత్వాలతో ఐక్యంగా వ్యవహరించడం లేదు. నవరత్నాల పేరుతో తాను అమలుచేస్తున్న తాత్కాలిక ఉపశమన చర్యలే సరిపోతాయని ప్రభుత్వం భ్రమలో వున్నట్లుంది. ప్రజలకు ఉపశమనం కల్పించే కొన్ని పథకాల అమలు అవసరమే. కాని ప్రజలు సొంత కాళ్ల పైన ఆత్మ గౌరవంతో బతకాలంటే అవి చాలవు.
కార్మికులు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, జీతాల చెల్లింపు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించడం, నిరుద్యోగులకు భృతి ఇవ్వడం, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం చెల్లింపు, పేదలకు గృహ కల్పన, ప్రజారోగ్యం, విద్యా సదుపాయాల మెరుగుదల, కౌలుదార్లకు రక్షణ-పరపతి ఏర్పాటు, ఆదివాసులకు-అటవీ హక్కులకు రక్షణ, విద్యుత్ చట్ట సవరణల అమలు నిరాకరణ, ఇతర రాష్ట్రాలతో కలిసి సమాఖ్య విధానాన్ని రక్షించడం, మతతత్వ శక్తులను నిరోధించడం చెయ్యాలి. ఈ అంశాలపై ఎన్నికల్లో చేసిన వాగ్దానాలనైనా అమలు చేయాలి. కాని రాష్ట్ర ప్రభుత్వం వాటిని మరచిపోయింది.
రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, జనసేనలు తెలుగు ప్రజల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుంటాయి. ‘మాట తప్పం, మడమ తిప్పం’ అని ప్రగల్భాలు పలుకుతుంటాయి. కాని దురదృష్టం ఏమిటంటే నేడు ఈ పక్షాలన్నీ కేంద్ర బిజెపి ప్రభుత్వ గుప్పెట్లో తోలు బొమ్మలాట రాజకీయాలను ఆడడానికి ఏ మాత్రం సిగ్గు పడడం లేదు.
ఈ పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో ఆందోళనకరమైన అంశం. అధికార, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు బిజెపి ప్రమాదాన్ని ఉపేక్షిస్తున్నాయి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు బిజెపి చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టకుండా, ఎదుర్కోకుండా దానికి కాళ్ళు తెస్తున్నాయి. ఈ పార్టీల అవకాశవాదాన్ని వినియోగించుకుని రాష్ట్రంలో బలం పుంజుకోవాలని బిజెపి కలలు కంటున్నది. ఈమధ్య రాష్ట్రాన్ని సందర్శించిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తమ సంస్థను రాష్ట్రంలో విస్తరించాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రమాదాన్ని లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, జనసేన పార్టీలు పట్టించుకోకుండా వదిలేస్తే వామపక్షాలు తమ శక్తి మేరకు బిజెపి సంఘపరివార్ ప్రమాదకర విధానాలను ఎదిరించి పోరాడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ప్రత్యేక హోదా అమలు గురించి ఆందోళనలు చేస్తున్నాయి. కరోనా విపత్తు, ఆర్థిక మాంద్యం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయి.
ఇప్పటి వరకు సంఘపరివార్, బిజెపి దుష్కృత్యాలకు మన రాష్ట్రం దూరంగా ఉంది. మనం ఉపేక్షిస్తే ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందనుకోలేం. అంతర్వేదిలో దేవాలయ రథాన్ని దుండగులు దహనం చేసిన ఘటనను ఉపయోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్లు చేసిన ప్రయత్నం ఆ ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నది. బిజెపితో అంటకాగుతున్న పార్టీలు మతతత్వ శక్తులను ప్రతిఘటించి రాష్ట్రాభివృద్ధిని, ప్రజల ప్రయోజనాలను రక్షిస్తాయని అనుకోలేం. ఇందుకు వామపక్షాలు, అభ్యుదయ లౌకికవాదులు, ప్రజా, సామాజిక సంస్థలు సమైక్యంగా పూనుకోవాలి. ఇదే మన ముందున్న మార్గం.