ప్రభుత్వ నిర్ణయం కారణంగా అమరావతి ప్రాంతంలో అలజడి మొదలైందా ? అంటే అవుననే చెప్పాలి. అమరావతి ప్రాంతంలోని మంగళగిరి మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి ప్రభుత్వం ఆర్ 5 జోన్ అనేదాన్ని కొత్తగా సృష్టించింది. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పేదలకు ఇళ్ళస్ధలాలు పంపిణీ చేయటమే ఉద్దేశ్యంగా ప్రభుత్వం కొత్తగా ఆర్ 5 అనే జోన్‌ను ఏర్పాటుచేసింది. పేదలకు ఇళ్ళస్ధలాల పంపిణీ కోసమని ఇప్పటికే ప్రభుత్వం 4 జోన్లను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
రాజధాని ప్రాంతంలో పట్టాల పంపిణీ చేయటానికి రెడీ అయినపుడు టీడీపీతో పాటు కొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తు కోర్టులో కేసులు వేశారు. ఆ కేసుల విచారణ ఇంకా జరుగుతోంది. ఒకవైపు కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే మరోవైపు ప్రభుత్వం కొత్తగా ఆర్ 5 పేరుతో కొత్త జోన్‌ను ఏర్పాటుచేయటమే ఆశ్చర్యంగా ఉంది. మంగళగిరి, మందడం మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో పేదలకు పట్టాల పంపిణీ కోసం 900 ఎకరాలను గుర్తించింది.
ఆర్ 5 జోన్ ఏర్పాటుకు సీఆర్డీఏ చట్టాన్ని సవరించి మరీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి సీఆర్డీఏని గతంలోనే ప్రభుత్వం రద్దుచేసింది. అయితే దీన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. అందుకనే ఈ విషయాలన్నీ వివాదాస్పదమై కోర్టులో కేసులను ఎదుర్కొంటున్నాయి. ఇపుడు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని అంశం కోర్టు విచారణలో ఉండగా ప్రభుత్వం తనిష్టానుసారం ఎలా నిర్ణయాలు తీసుకుంటుందని రైతులు మండిపోతున్నారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కూడా తాము కోర్టులో సవాలు చేస్తామంటు రైతులు చెబుతున్నారు. గ్రామసభల్లో ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం ఏమిటంటు రెచ్చిపోతున్నారు. తాజా నిర్ణయంలోనే ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేయాలో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. దీన్ని కూడా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి కోర్టుల్లో కేసులు వేయటానికి రైతులు రెడీ అవుతున్న సమయంలో ఆర్ 5 జోన్ అమలుకు ప్రభుత్వం ఎలాంటి పద్దతిని అనుసరిస్తుందో చూడాల్సిందే.