తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఈ బైపోల్ లో విజయం సాధించేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. నవంబర్ మూడో తేదీన పోలింగ్ జరగనుండడంతో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ మునుగోడు రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చారు.
ఈ నేపథ్యంలోనే మునుగోడు బైపోల్ లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దాదాపు 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులను రాజగోపాల్ రెడ్డి దక్కించుకున్నారని, బిజెపిలో చేరడం వల్లే ఆయనకు ఆ భారీ కాంట్రాక్టు పనులు దక్కాయని వారు ఆరోపించారు.
ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఆయనపై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ నేతలు ఈసీని కోరారు. ఆ కాంట్రాక్టులు దక్కించుకోవడం వల్ల వచ్చిన డబ్బులతో మునుగోడులో రాజగోపాల్ ఓట్లు కొంటున్నారని, ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వారు ఆరోపించారు. అంతేకాదు, ఆ 18 వేల కోట్ల రూపాయలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా వాటా ఉందని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఈటల, రాజగోపాల్ రెడ్డిల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.