ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు స్థానాలలో ఏలూరు పార్లమెంటు స్థానం రెండు ప్రధాన పార్టీలకు చెందిన బిసి నేతల కురుక్షేత్ర మహాసంగ్రామానికి వేదిక కానుంది. ఏలూరు పార్లమెంటు సీటును వైసిపి, టిడిపి రెండు పార్టీలు కూడా బీసీలలో బలమైన యాదవ సామాజిక వర్గానికి కేటాయించడం విశేషం. చంద్రబాబు ఏలూరు పార్లమెంటు సీటును తొలిసారిగా ప్రయోగం చేస్తూ బీసీలకు ఇస్తున్నట్టు దాదాపు ఏడాది క్రితమే సంకేతాలు ఇచ్చేశారు. ఈ క్రమంలోనే జగన్ కూడా చంద్రబాబు ప్లాన్ గ్రహించి ముందుగా కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కు కేటాయించారు.
టిడిపి నుంచి కొన్ని పేర్లు వినిపించినా అదే బీసీల్లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ యాదవ్ పేరు ఖరారు చేశారు. పుట్టా మహేష్ యాదవ్ బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన వారసుడు కావడం విశేషం. మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ప్రస్తుతం టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన టీటీడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇక ఇటు మహేష్ మామ యనమల రామకృష్ణుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
యేడాది ముందే చంద్రబాబు బీసీ స్కెచ్..
ఈ సారి ఏలూరు పార్లమెంటు సీటును బీసీలకు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు యేడాది క్రితమే నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా బీసీల్లో బలమైన యాదవ నేతల కోసం అన్వేషణ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ యాదవ్ అయితే సామాజికంగాను, ఆర్థికంగాను తిరుగులేని నేత అవుతారని నిర్ణయించి ఆయనకే టిక్కెట్ కన్ఫార్మ్ చేశారు. చంద్రబాబు బీసీ ఎత్తుగడ ముందే గమనించిన జగన్ సునీల్‌కుమార్ యాదవ్‌ను ముందుగానే రంగంలోకి దింపారు.
ఏలూరు పార్లమెంటు పరిధిలో దాదాపు 2 లక్షలకు కాస్త అటూ ఇటూగా కేవలం బీసీ – యాదవ ఓటర్లే ఉన్నారు. ఇక్కడ అభ్యర్థిని గెలిపించాలంటే వీరి ఓట్లే కీలకం. మరీ ముఖ్యంగా చింతలపూడి, పోలవరం, దెందులూరు, ఏలూరు, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో యాదవులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారు.
ఒక్క అసెంబ్లీ సీటూ బీసీలకు ఇవ్వని జగన్..
పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా జగన్ బీసీలకు ఇవ్వలేదు. నూజివీడులో వెలమ, దెందులూరు కమ్మ, ఏలూరు, ఉంగుటూరు, కైకలూరు సీట్లు కాపు నేతలకు ఇవ్వగా, చింతలపూడి ఎస్సీ, పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు. కానీ ప్రతిపక్ష కూటమిలో ఈక్వేషన్లు అదిరిపోయాయి. రిజర్వ్డ్ సీట్లు పోను దెందులూరు కమ్మ, ఉంగుటూరు క్షత్రియ, కైకలూరు బీజేపీ కోటాలో బీసీ అయ్యే ఛాన్స్ ఉంది. ఏలూరు కాపులకు ఇవ్వగా, ఇదే పార్లమెంటు పరిధిలో ఉన్న నూజివీడు సీటును కూడా యాదవ వర్గానికే చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి కేటాయించారు. అటు నూజివీడు సీటు కూడా టీడీపీ యాదవులకే ఇవ్వడంతో ఆ ప్రభావం పార్లమెంటు సెగ్మెంట్ మొత్తం మీద చాలా గట్టిగా ఉంది.
పార్లమెంటు పరిధిలో టీడీపీకి ఇప్పటికే సంస్థాగతంగా బలంగా ఉన్న ఓటు బ్యాంకుతో పాటు టీడీపీకి సంప్రదాయంగా కొమ్ముకాసే సామాజిక వర్గాలతో పాటు ఇప్పుడు యాదవ సామాజిక వర్గం మొత్తం పార్టీకే కొమ్ము కాసేలా కనిపిస్తోంది. ఒకే పార్లమెంటు పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు రెండూ యాదవులకే గతంలో ఏ ప్రధాన పార్టీ ఇచ్చిన సందర్భాలు లేవు. దీంతో ఇప్పుడు యాదవుల్లో సరికొత్త జోష్ రావడంతో పాటు వారంతా టీడీపీ వైపు వన్‌సైడ్ అయిపోతున్నారు.
మామూలుగానే యాదవ సామాజిక వర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వైపే మెజార్టీ కొమ్ము కాస్తోంది. 2019లో జగన్ మాయలో కొందరు పడినా ఈ ఐదేళ్లలో వాళ్లకు అక్కడ ఎదురైన అవమానాల నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఉన్న వారు కూడా స్వచ్ఛందంగా టీడీపీ చెంత చేరుతున్నారు. ఏదేమైనా ఏలూరు పార్లమెంటు పరిధిలో జగన్ ఎంపీ సీటు ఇస్తే.. చంద్రబాబు ఎంపీ, ఒక అసెంబ్లీ సీటు ఇవ్వడంతో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని యాదవుల్లో మామూలు జోష్ అయితే లేదు.