పేరుకు నాగరిక సమాజంగా చెప్పుకునే ఈ కాలంలోనూ ప్రపంచంలోని పలు దేశాల్లో నియంతలదే రాజ్యం నడుస్తోంది. అలాంటి దేశాల్లో రష్యా ఒకటి. ఆ దేశానికి అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికైన తర్వాత నుంచి ఆయన తప్పించి మరో నేత ఎన్నిక కాని పరిస్థితి. తాను ఉన్నంతవరకు తాను మాత్రమే పదవిలో ఉండేలా మార్పులు చేసుకున్న ఘనత అతగాడి సొంతం. అతడ్ని విమర్శించినోళ్లు ఎంతటి స్థాయికి చెందిన వారైనా సరే.. అనుమానాస్పద రీతిలో మృతి చెందుతారన్న పేరు పుతిన్ కు ఉంది.
దేశంలో విపక్ష నేతలే లేకుండా చేసుకున్న పుతిన్.. తన పాలనలో దొర్లే తప్పుల్ని బయటకు చెప్పినంతనే వారి నోటిని కట్టేసే కఠినమైన తీరును ప్రదర్శిస్తుంటారు పుతిన్. గతంలో ఆయనపై తీవ్ర విమర్శలతో పాటు.. ఘాటు ఆరోపణలు చేసిన ఒక ఎయిర్ కమాండర్ తాజాగా తన భార్యతో సహా అనుమానాస్పద రీతిలో మరణించి ఉండటం సంచలనంగా మారింది. పుతిన్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు.
గతంలో రష్యా ఎయిర్ ఫోర్సులో పని చేసిన వ్లాదిమిర్ స్విరిదోవ్.. తన నివాసంలో చనిపోయి పడి ఉన్నాడు. అతడి పక్కనే అతడి భార్య కూడా అనుమానాస్పద రీతిలో మరణించటం గమనార్హం. ఈ మరణాలకు కారణం ఏమిటన్నది రష్యా పోలీసులు ఇప్పటివరకు నోరు విప్పింది లేదు. గతంలో ఎయిర్ ఫోర్సు ప్రమాణాలపై మాట్లాడిన ఆయన.. పుతిన్ పై తీవ్ర విమర్శలు గుప్పించేవాడు.
2005-2009 మధ్య కాలంలో వాయుసే.. ఎయిర్ డిఫెన్స్ ఫోర్సుల్లో కమాండర్ గా పని చేసిన అతను.. సైన్యంలో పైలెట్లకు తగిన శిక్షణ లభించటం లేదన్న ఆరోపణ చేశారు. సాయుధ దళాల్లో పని చేసే ఉన్నతాధికారుల వేతనాలు.. పరిస్థితులు దారుణంగా ఉన్నట్లుగా చెబుతారు. ఈ కారణంగానే రష్యాను వదిలేసి.. వెళ్లిపోతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సాయుధ దళాల్లో పని చేసే వారి పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆరోపించారు. అందుకే.. పలువురు ఉన్నతాధికారులు సైన్యాన్ని విడిచి పెట్టేసి వెళ్లిపోతున్నట్లుగా ఆరోపించారు.
అంతేకాదు యుద్ధానికి సిద్ధంగా ఉంటే ఒక పైలట్ ఏడాదికి వంద గంటలు నడిపి ఉండాలి. అదే కనీస అర్హత. కానీ.. ప్రస్తుతం 25-30 గంటల డ్రైవింగ్ తోనే వార్ పైలెట్ అయిపోతారు. ఇలా వ్యవస్థల్లోని లోపాల గురించి మొహమాటం లేకుండా వెల్లడించిన ఆమె.. తాజాగా శవమై కనిపించటం గమనార్హం. థర్డ్ ర్యాంకింగ్ పైలట్లను మిలటరీ అకాడమీలకు పంపిస్తున్నామని.. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. పుతిన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు వెనుకాడని అతగాడు.. ఇప్పుడు ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించి ఉండటం షాకింగ్ గా మారింది.